ఈశ్వరా.. ప్రాణం నిలపరా! | Sri Sathya Sai Man Struggles For Life Family Seeks Financial Help | Sakshi
Sakshi News home page

ఈశ్వరా.. ప్రాణం నిలపరా!

Aug 11 2026 12:41 PM | Updated on Aug 11 2026 12:41 PM

Sri Sathya Sai Man Struggles For Life Family Seeks Financial Help

శ్రీ సత్యసాయి జిల్లా: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. తలుపుల మండలం వేపమానుపేట పంచాయతీ కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్‌ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. 

చిన్న ఉద్యోగం.. అంతలోనే సంక్షోభం 
యోగేశ్వర్‌ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని కంటికి రెప్పలా పోషించే వారు. కుటుంబానికి ఏకైక జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్‌ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే రూ.50 లక్షలకు పైగా భారీ   వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు. 

ఉన్న భూమిని అమ్మేసినా.. 
భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన  సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా మారింది.

తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు 


ఆ పసిగుడ్డుకు ఇంకా      ప్రపంచం    అంటే   ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది.  

చేయూతే ఆశాకిరణం 
కళ్లముందే కుటుంబ పెద్ద అవస్థను చూస్తూ ఆ    కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్‌ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. దాతలు తమకు తోచిన ఆర్థిక    సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలవవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్‌కు ఫోన్‌పే,గూగుల్‌పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్‌ నంబర్‌: 30754629889, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: SBIN0010187  ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాకు డబ్బు బదిలీ చేసి యోగేశ్వర్‌ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement