– పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఎన్. పుణ్యమూర్తితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి
సాంప్రదాయ పశువైద్య విధానాలకు (ఎత్నోవెటర్నరీ మెడిసిన్–ఈవీఎం) శాస్త్రీయ గుర్తింపు తీసుకురావడంలో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన వెటర్నరీ ప్రొఫెసర్ ఎన్. పుణ్యమూర్తి(69) ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు పద్మశ్రీ అందుకున్న ఐదుగురు వెటర్నేరియన్లలో ఒకరు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ మూలికా వైద్యంతో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది. తద్వారా భవిష్యత్తులో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారాయన. ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు...
→ ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు అంటే?
విశ్రాంత వెటర్నరీ ప్రొఫెసర్‌గా నాకున్న శాస్త్రీయ జ్ఞానం, పురాతన సిద్ధ వైద్య రీతిలోని సంప్రదాయం విజ్ఞానాన్ని మేళవించి పాతికేళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నాను. ఇంటి పట్టున దొరికే సాధారణ మూలికలతో రైతులే పశువైద్యం చేసుకోవటానికి తోడ్పడేవే ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు.
→ సాంప్రదాయ పశువైద్యానికి శాస్త్రీయత ఉందా?
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘మైక్రోబియల్ పాథోజెనిసిస్’లో ఈవీఎం చికిత్సలపై ఇటీవల ప్రచురితమైన తొలి వ్యాసం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నాతో పాటు చాలా మంది శాస్త్రవేత్తలు, వివిధ ప్రభుత్వ పరిశోధన సంస్థలు సాధించిన విజయాలే ఇందుకు దోహదపడ్డాయి. ఉదాహరణకు.. పాడి పశువులకు వచ్చే ముఖ్య వ్యాధుల్లో పొదుగు వాపు ఒకటి. కలబంద ఆకులు 250 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సున్నం 15 గ్రాముల మిశ్రమాన్ని వాడితే 85% పశువుల్లో 3–5 రోజుల్లోనే పొదుగువాపు తగ్గిపోతుంది. మొత్తం 34 పశు వ్యాధులకు ఇటువంటి నిర్థారిత ఈవిఎం చికిత్సలు ఉన్నాయి. సాధారణంగా శాస్త్రీయ పరిశోధనల్లో మొక్కల నుంచి ఒకే ఒక అణువును వేరు చేసి పరీక్షిస్తారు. కానీ, ఈ పరిశోధనలో మొదటిసారిగా ఈ మూడు పదార్థాల పూర్తి మిశ్రమాన్ని (హోల్ కాంబినేషన్‌ను) ఒక ‘ఫంక్షనల్ రెమెడీ’గా పరీక్షించి విజయం సాధించాం.
→ మీ పరిశోధనలకు నిధులు ఎలా సమకూరాయి?
ఎత్నోవెటర్నరీ మెడిసిన్ పద్ధతులు కేవలం అనుభవపూర్వకమైనవి మాత్రమే కావు, వాటి వెనుక బలమైన శాస్త్రీయ ఆధారం కూడా ఉందని మా పరిశోధనలు నిరూపించాయి. ప్రభుత్వాల నిధులతో గత 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2007లో మొదట రూ. 18 లక్షలు, తర్వాత రూ. 13.72 కోట్లు మంజూరు చేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. 80 లక్షలు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది.
→ ఈవీఎం చికిత్సల క్షేత్రస్థాయి ఫలితాలెలా ఉన్నాయి?
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాడి రైతులతో అమలు చేయిస్తోంది. గుజరాత్‌లోని ‘సాబర్ మిల్క్ యూనియన్’లో ఈ చికిత్సలను ఎన్ డీడీబీ విజయవంతంగా పరీక్షించింది. 2017 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా పాడి పశువుల చికిత్స ఫలితాలతో డిజిటల్ డేటాను ఎన్‌డీడీబీ సేకరించింది. పొదుగు వాపు వ్యాధి నివారణలో 85% పైగా అద్భుతమైన క్లినికల్ సక్సెస్ రేట్ నమోదైంది. కేవలం 3–5 రోజుల్లోనే పశువులు కోలుకున్నాయి. 34 రకాల పశువ్యాధుల నివారణకు ఎన్ డీడీబీ ఈ చికిత్సలను అనుసరిస్తోంది.
→ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కట్టడి అవుతుందా?
పశువైద్యంలో యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం వల్ల బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని (యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ –ఏఎంఆర్)ను పెంచుకుంటోంది. ఈ మూలికా వైద్యం వల్ల యాంటీబయాటిక్స్ వాడకం తగ్గి, భవిష్యత్తులో ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. ‘స్టాండర్డ్ వెటర్నరీ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్ ’(ఎస్‌వీటీజీ)లో కూడా ఈవీఎం చికిత్సలను చేర్చారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ భాగస్వామ్యంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం చికిత్స విధానాన్ని వెటర్నరీ విద్యార్థుల సిలబస్‌లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంటర్వ్యూ:పంతంగి రాంబాబు
సాక్షి సాగుబడి డెస్క్


