మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Mojtaba Khameneis Fate in Question: Trumps Stunning Claim | Sakshi
Sakshi News home page

మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Jul 14 2026 9:14 AM | Updated on Jul 14 2026 9:20 AM

Mojtaba Khameneis Fate in Question: Trumps Stunning Claim

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్‌ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్‌.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. 

మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్‌ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్‌ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.

తండ్రి మరణం తర్వాత తెరపైకి.. 
ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్‌ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్‌జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. 

ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.

త్వరలో ప్రజల ముందుకు వస్తారా?
ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.

‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలు
ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్‌ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.

హర్ముజ్‌పై ట్రంప్‌ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్‌
ఇదే సమయంలో ట్రంప్‌ హర్ముజ్‌ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్‌ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్‌ భగ్గుమంది. హర్ముజ్‌ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్‌ దేశాలను సైతం వారించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement