ఈ మధ్య యూరోపియన్ దేశాలను కార్చిచ్చులు కాల్చిపారేస్తున్నాయి. మూడు రోజుల క్రితం స్పెయిన్‌లోని ఓ పర్యాటక ప్రదేశంలో కార్చిచ్చు కారణంగా 17 మందికిపైగా మరణించారు. కార్చిచ్చు మాత్రమే కాదు తుపాన్లు చుట్టుముట్టినా ఈ ఇంటికి ఏమీ కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయని తెలిస్తే చాలు ఇల్లు మొత్తం నేల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గొయ్యిలోకి దిగిపోతుంది.
అమెరికన్ ఇంజినీర్లు సృష్టించిన ఈ అద్భుతం పేరు ‘హైబర్ టెక్ హోమ్స్’. మీరు ఎక్కడున్నా ఇంటిని భూమి లోపలికి పంపించేసేందుకు యాప్ రెడీ చేశారు. యాప్‌లో బటన్ నొక్కడమే ఆలస్యం హైడ్రాలిక్ గేర్ల సాయంతో ఇల్లు.. అడుగున ఉన్న బాక్స్‌లోకి వేగంగా జారిపోతుంది. ఇంట్లోని విద్యుత్తు, గ్యాస్ కనెక్షన్లు, నీటి, మురుగునీటి వ్యవస్థలు ఆటోమెటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతాయి.
ఇంటి చుట్టూ మంటలు ఆర్పేసే గ్యాస్ పనిచేసేందుకు రెడీ అవుతుంది. ఇల్లు మొత్తం లోపలకు దిగిపోగానే బాక్స్ పైకప్పు మొత్తం మూసుకుపోతుంది. ఈ ప్రక్రియ మొత్తం 15 నిమిషాల్లో ముగిసిపోతుందని, మొత్తం వ్యవహారం గురుత్వాకర్షణ శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి విద్యుత్తు అవసరం కూడా ఉండదని దీని సృష్టికర్తలు చెప్పారు. ఇంటిని ఒక బంకర్‌లా వాడుకోవడం కుదరదు. విపత్కర పరిస్థితుల్లో ఇంటిని కాపాడొచ్చుగానీ ఆ సమయంలో ఇంట్లో ఉండేందుకు వీలుండదని ఇంజినీర్లు స్పష్టంచేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


