బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నిషేధిత అవామీ లీగ్ పార్టీ నాయకురాలు షేక్ హసీనా డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లిపోతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తే ఆమెను నేరుగా జైలుకు పంపుతామని ఆయన అన్నారు.
కాగా 78 ఏళ్ల షేక్ హసీనా, 2024 ఆగస్టులో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా తన పదవిని కోల్పోయారు. ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె ఢాకా నుంచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందారు. అయితే నిరసనల సమయంలో హసీనా ప్రభుత్వం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఢాకాలోని ప్రత్యేక అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును, తనపై వచ్చిన ఆరోపణలను షేక్ హసీనా పూర్తిగా "రాజకీయ ప్రేరేపితమైనవి" గా తోసిపుచ్చారు.
హసీనా లొంగిపోతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. హసీనాను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు గత మధ్యంతర ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని కొనసాగిస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన అవామీ లీగ్ నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకే ఆమె విదేశాల నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు అని షామా ఒబేద్ ఇస్లాం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.


