బెంగాల్‌లోని డార్జిలింగ్ సమీపంలో తీస్తా నది విహంగ వీక్షణం
బంగ్లాదేశ్, చైనాల మధ్య టీఆర్‌సీఎంఆర్‌పీ ఒప్పందం
దేశ భద్రతకు, ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానానికి ముప్పు
భారత్‌లోని సిలిగురి కారిడార్ సమీపంలో ఉన్న తీస్తా నదీ ప్రాజెక్టుపై చైనా మరోసారి దృష్టి సారించింది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇటీవల చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ దేశం చాలా ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు షేక్ హసీనా ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాజెక్ట్ సున్నితమైన సిలిగురి కారిడార్ సమీపంలో ఉండటంతో ఈ పరిణామాలు భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఆధిపత్య పోటీ..
తూర్పు హిమాలయాల్లో పుట్టి, సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే తీస్తా నది 414 కిలోమీటర్లు ప్రవహించి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఇందులో అధిక వాటా కావాలన్న బంగ్లాదేశ్ డిమాండ్ కారణంగా ఇరుదేశాల మధ్య చాలాకాలంగా వివాదం ఉంది. మహ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చడానికి భారత్ ముందుకొచ్చింది. దీనిపై 2016 నుంచి చైనా కన్ను ఉంది.
అయితే, 2020లోనే తీస్తా ప్రాజెక్టును ఆవిష్కరించినప్పటికీ, ఆర్థికపరమైన పరిమితులు, సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడంతో భారత్ ఆందోళనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా తుది ఆమోదాన్ని నిలిపివేశారు. అది ప్రణాళిక దశను దాటి ముందుకు సాగలేదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం కుదుర్చుకున్న తాజా ఒప్పందం, తీస్తా విషయంలో చైనాకున్న ఆసక్తిని తెలియజెప్పడమే కాదు.. బంగ్లాదేశ్‌పై ఆధిపత్యానికి భారత్, చైనాల మధ్య పోటీని కూడా ప్రతిబింబిస్తోంది.
ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి సాధ్యాసాధ్యాల అధ్యయనానికే పరిమితమైనప్పటికీ, బంగ్లాదేశ్‌లోని అత్యంత ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో చైనా మరింతగా పాలుపంచుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న పవర్‌చైనా సంస్థ వల్ల మరింత ప్రమాదం ఉంది. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది చైనా ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థ. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ద్వంద్వ–ఉపయోగ మౌలిక సదుపాయాలను నిర్మించిన చరిత్ర ఈ సంస్థకు ఉంది.
చైనా బంగ్లాదేశ్‌తో కలిసి
పనిచేయనున్న తీస్తా ప్రాజెక్ట్ ఏమిటి?
తీస్తా నది వెంబడి వరదలను నియంత్రించడం, నీటి భద్రతను మెరుగుపరచడం, నదీ జీవావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, ఆర్థిక సామర్థ్యాన్ని వెలికితీయడం ఈ తీస్తా సీఎంఆర్‌పీ లక్ష్యం. నదీ తీరాల వెంబడి రోడ్లు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ కేంద్రాలు, పర్యాటక సౌకర్యాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు అభివృద్ధి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 2016 సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ జల అభివృద్ధి బోర్డు, చైనా ఇంజనీరింగ్ సంస్థ పవర్‌చైనాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడంతో తీస్తా సీఎంఆర్‌పీ ప్రారంభమైంది.
2019మేలో ఈ ప్రాజెక్ట్‌కు అధికారిక ప్రభుత్వ చట్రం లభించింది. 2020లో దీనినొక భారీ నదీ పునరుద్ధరణ కార్యక్రమంగా బహిరంగంగా ఆవిష్కరించారు. అప్పటి ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం సాధ్యాసాధ్యాల అధ్యయనాలను ప్రారంభించి, 2020లో ఈ ప్రతిపాదనను ఆవిష్కరించింది. వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతంలో పెద్ద ప్రాజెక్ట్‌పై భారత్ ఆందోళనలు వ్యక్తం చేయడంతో ఆమె తుది ఆమోదం తెలపలేదు.
చైనానే ఎందుకు?
ఇప్పుడు మరోసారి చైనాతో బంగ్లాదేశ్ భాగస్వామ్యం కావడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమయ్యే గణనీయమైన ఆర్థిక వనరులు, అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యం. ఆనకట్టలు, నదీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వరద నియంత్రణ, నీటిపారుదల రంగాలలో దానికి విస్తృతమైన అనుభవం ఉంది. 2022లో పూర్తయిన పద్మా వంతెనతో సహా, బంగ్లాదేశ్‌లో కూడా చైనా సంస్థలు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించాయి.
తీస్తా నదీ జలాల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన మరో కారణం. బంగ్లాదేశ్‌కు ఎక్కువ నీటిని మళ్లించడం వల్ల రాష్ట్రంలోని రైతులకు నష్టం జరుగుతుందని పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కోల్‌కతా సమ్మతి లేకుండా కేంద్రం ముందుకు సాగలేకపోయింది. 2024లో తీస్తా ప్రాజెక్టుకు 1 బిలియన్ నిధులు సమకూర్చడానికి కేంద్రం ముందుకొచ్చింది. హసీనా వైదొలగడంతో తలెత్తిన రాజకీయ గందరగోళం చర్చలను నిలిపివేసింది. మహమ్మద్ యూనస్ మధ్యంతర పాలనలో భారత ప్రతిపాదన అటకెక్కింది. చైనా, భారత్ కంటే వేగంగా కదిలింది.
భారత్‌కు ఆందోళన ఎందుకు?
తీస్తా నది ప్రాజెక్టుపై చైనా–బంగ్లాదేశ్ ఒప్పందం గురించి భారత్ ఆందోళన చెందడానికి బలమైన కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది భౌగోళిక సామీప్యత. బంగ్లాదేశ్‌లోని నీల్‌ఫామరి, రంగపూర్ ప్రాజెక్టు ప్రాంతాలు, మనదేశంలోని జల్‌పాయిగురి జిల్లాకు ఆనుకొని ఉన్నాయి. అత్యంత వ్యూహాత్మకమైన సిలిగురి కారిడార్ కూడా ఇదే ప్రదేశంలో ఉంది. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే అత్యంత ఇరుకైన ఈ సన్నని భూభాగం, ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కలిపే ఏకైక భూమార్గం. ఈ ప్రాంతంలో శత్రు ఉనికి భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీస్తుంది.
బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం భారత్‌కు రెండు వైపుల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. తీస్తా బేసిన్‌లో చైనా ప్రమేయం పెరగడం వల్ల అంతర్గత అశాంతి చెలరేగుతుంది. ఇప్పటికే సున్నితమైన ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతుంది. నదీ జలవనరుల పంపిణీ విషయంలో బంగ్లాదేశ్‌తో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ప్రాజెక్ట్‌పై అభిప్రాయాలను గతంలోనే ఆ దేశానికి తెలిపింది. ప్రస్తుతానికి, తీస్తా సాధ్యాసాధ్యాల అధ్యయనం చివరికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి.


