బాస్ ఏంజిలిస్: ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియం జట్టును ఓడించింది. స్పెయిన్ తరఫున ఫాబియన్ రూయిజ్ (30వ నిమిషంలో), సబ్ స్టిట్యూట్ మికెల్ మదీనో 88వ నిమిషంలో ఒక్కో గోల్ చేశారు.
బెల్జియం జట్టుకు చార్లెస్ కెటెలార్ (41వ నిమిషం లో) ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్‌లో స్పెయిన్ 16 సార్లు బెల్జియం గోల్‌పోస్టుపై దాడి చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. చివరిసారి స్పెయిన్ జట్టు 2010లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆ ఏడాదే తొలిసారి ప్రపంచకప్ టైటిల్‌ను సాధించింది.
1986 ప్రపంచకప్‌లోనూ స్పెయిన్, బెల్జియం జట్లు క్వార్టర్ ఫైనల్లో తలపడగా..పెనాల్టీ షూటౌట్'లో బెల్జియం 5- 4తో స్పెయిన్‌ను ఓడించింది. తాజా విజయంతో స్పెయిన్ 40 ఏళ్ల తర్వాత బెల్జియం చేతిలో ఎదురైన పరాజయానికి లెక్క సరి చేసింది. బుధవారం డాలస్లో జరిగే తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడుతుంది.


