ఆర్‌ఆర్‌ఆర్‌ ఆరంభించండి | CM Revanth Reddy appeals to Union Minister Nitin Gadkari On RRR | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆరంభించండి

Jul 15 2026 1:53 AM | Updated on Jul 15 2026 1:53 AM

CM Revanth Reddy appeals to Union Minister Nitin Gadkari On RRR

ఉత్తర భాగం నిర్మాణ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్‌ అనుమతి ఇప్పించండి

ఫ్యూచర్‌ సిటీ–బందరు పోర్ట్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి అనుమతులు ఇవ్వండి 

రాజీవ్‌ రహదారికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించండి 

శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు అటవీశాఖ అనుమతులు ఇప్పించండి 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్‌ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం గడ్కరీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో రేవంత్‌ భేటీ అయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని వివరించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మిస్తామని ఏపీ పునరి్వభజన చట్టంలో పేర్కొన్నందున వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్‌–విజయవాడ మధ్య 100 కి.మీ. దూరం తగ్గుతుందని, సరకు రవాణా వేగవంతమవుతుందని సీఎం వివరించారు.  

అటవీశాఖ అనుమతులు ఇప్పించండి 
మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు సంబంధించి కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్‌ పరిధిలో ఉంటాయని సీఎం తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్‌ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణను తాము చేపడతామని తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ రఘువీర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్‌ సెక్రటరీ కోఆర్డినేషన్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement