హైదరాబాద్: ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్షలు పక్కన పెట్టి రైతుల ప్రయోజనాల కోసం పని చేయాలన్నారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1 నార్లాపూర్ లో వెట్ రన్ విజయవంతం కావడం సంతోషకరమన్నారు.
కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులను రాజకీయ కక్షతో ఇన్నాళ్లు పడావు పెట్టారన్నారు. 2024, 2025లో పుష్కలంగా వర్షాలు వచ్చాయని, ఇప్పటికే పంపులను నడిపి నార్లాపూర్ రిజర్వాయర్ నింపుకుని ఉంటే ఈ ఏడాది కరువు వచ్చేది కాదన్నారు.
‘ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైనా పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. కృష్ణా నదిలోకి వరద వచ్చిన వెంటనే కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని రిజర్వాయర్లు నింపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలు పక్కనపెట్టి ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు.


