నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు | Projects are stalled despite lack of water allocations | Sakshi
Sakshi News home page

నీటి కేటాయింపులు లేకున్నా అడ్డగోలుగా ప్రాజెక్టులు

Apr 19 2026 6:20 AM | Updated on Apr 19 2026 6:20 AM

Projects are stalled despite lack of water allocations

ఏపీ, తెలంగాణలో కొత్త ప్రాజెక్టులతోపాటు 

పాత ప్రాజెక్టుల విస్తరణ.. వీటికి అనుమతుల విషయంలో సీడబ్ల్యూసీ మార్గనిర్దేశం కోరిన కృష్ణాబోర్డు  

భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టులకు అనుమతులు 

తిరస్కరణకు గురికావొచ్చన్న బోర్డు.. ట్రిబ్యునల్‌ 

కేటాయింపులు జరిపేవరకు అనుమతులొద్దని సూచన 

సీడబ్ల్యూసీకి రాసిన లేఖలో స్పష్టం చేసిన కృష్ణా బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు మిగులు జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ‘ఇంకా కేటాయింపులు జరపని’జలాల ఆధారంగా.. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు అడ్డగోలుగా చేపట్టడంతోపాటు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతుల జారీ విషయంలో మార్గనిర్దేశం చేయాలని కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు ఏ మేరకు విస్తరణ చేపట్టారో నిర్థారించడానికి ఆయా ప్రాజెక్టులకు గతంలో టీఏసీ అనుమతులను ఏ మేరకు జారీ చేశారో తమకు అందజేయాలని కోరింది. 

ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగ చీఫ్‌ ఇంజనీర్‌కు లేఖ రాసింది. కేటాయింపులు జరపని నీళ్ల ఆధారంగా.. ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు విస్తరణను అనుమతి లేకుండా చేపట్టినా .. భవిష్యత్‌లో అంతర్రాష్ట్ర అనుమతులు, పెట్టుబడి అనుమతుల తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని లేఖలో కృష్ణాబోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. నీటి లభ్యతతోపాటు అంతర్రాష్ట్ర పర్యవసానాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతుల జారీని పరిశీలించడం సాధ్యం కావడం లేదని తెలిపింది. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..  

ట్రిబ్యునల్‌ తేల్చే వరకు అనుమతులొద్దు  
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8)(డీ) ప్రకారం 2024 జూన్‌ 2కు ముందు నిర్మాణం పూర్తయిన, నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టుల నీటి లభ్యతపై కొత్త ప్రాజెక్టు ఎలాంటి దు్రష్పభావం చూపరాదు. కచ్చితమైన నీటి లభ్యత, నీటి కేటాయింపులుంటేనే ప్రాజెక్టులకు టెక్నో–ఎకనామిక్‌ అనుమతులు, అంతర్రాష్ట్ర అనుమతులు, పెట్టుబడి అనుమతులు జారీ చేయాలని ఈ నిబంధన తెలియజేస్తోంది. కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు జరిపే వరకు మిగులు జలాల నిర్థారణపై అనిశ్చితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో వాటి ఆధారంగా కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికల తయారీ, వాటికి అనుమతుల జారీ సరైంది కాదు.  

అనుమతులు లేని ప్రాజెక్టులపై ఏం చేయలేకపోతున్నాం  
కేంద్రం 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని పేరా 2(ఎఫ్‌), 2(జీ) ప్రకారం.. నిర్మాణంలోని అనుమతి లేని ప్రాజెక్టులతోపాటు విస్తరణకు లోనైన ప్రాజెక్టులకు నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో వాటి వినియోగాన్ని నిలుపుదల చేయాలి. ఈ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ వేసిన కేసు న్యాయస్థాన పరిధిలో ఉండడంతో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో కృష్ణా బోర్డు లేదు. కచ్చితమైన నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులను నీటి వినియోగం కోసం ఏదైన నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు.  

మళ్లీ అనుమతులు పొందాల్సిందే... 
ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు విస్తరణకు లోనైనట్టు బోర్డు పరిశీలనకు వచ్చింది. ఆయా ప్రాజెక్టులకు గతంలో సీడబ్ల్యూసీలోని టెక్నికల్‌ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) జారీ చేసిన అనుమతులకు విరుద్ధంగా వాటిపై అదనపు ఎత్తిపోతల పథకాలు నిర్మించడం, కాల్వల సామర్థ్యం పెంచడం, ఆయకట్టు సామర్థ్యం పెంచడం, ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి నీటిని తరలించడం వంటివి చేశారు. దీంతో ఈ ప్రాజెక్టులకు మళీఅనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కొత్త ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ఇలా విస్తరణకు గురైన ప్రాజెక్టులను సైతం అనుమతులు లేని ప్రాజెక్టులుగా పరిగణించాల్సి ఉంటుంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement