‘ఏటీఎం’ కీలక మార్పులు.. కెనరా, ఎస్‌బీఐ కొత్త రూల్స్ ఇవే.. | Canara Bank SBI ATM Rules Changed Free Transactions New Charges 2026 | Sakshi
Sakshi News home page

‘ఏటీఎం’ కీలక మార్పులు.. కెనరా, ఎస్‌బీఐ కొత్త రూల్స్ ఇవే..

Sep 3 2026 4:53 PM | Updated on Sep 3 2026 5:19 PM

Canara Bank SBI ATM Rules Changed Free Transactions New Charges 2026

ఏటీఎం వినియోగించే బ్యాంకు ఖాతాదారులకు సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. కెనరా బ్యాంక్‌ (Canara Bank) సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఏటీఎం ఛార్జీలను సవరించగా.. ఎస్‌బీఐ (SBI) అక్టోబర్‌ 1 నుంచి శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించే సందర్భంలో ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించనుంది.

కెనరా బ్యాంక్‌: ఫ్రీ ఏటీఎం లావాదేవీలు తగ్గింపు

కెనరా బ్యాంక్‌ సాధారణ సేవింగ్స్‌ ఖాతాదారులకు తన ఏటీఎంలు, క్యాష్‌ రీసైక్లర్లలో నెలకు లభించే ఉచిత లావాదేవీలను 6 నుంచి 5కు తగ్గించింది. ఇందులో ఫైనాన్షియల్‌, నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలు రెండూ ఉంటాయి. అయితే సీనియర్‌ సిటిజన్లకు 8 ఉచిత లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఈ మార్పులు సెప్టెంబర్‌ 1, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

ఉచిత పరిమితి దాటిన తర్వాత కెనరా బ్యాంక్‌ ఏటీఎంలో నగదు ఉపసంహరణ, ఏటీఎంలో యూపీఐ ద్వారా విత్‌డ్రా వంటి ఫైనాన్షియల్‌ లావాదేవీలకు రూ.23 + జీఎస్టీ వసూలు చేస్తుంది. నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలకు రూ.5 + జీఎస్టీ ఛార్జీ ఉంటుంది.

అలాగే, ఉచిత పరిమితి దాటిన తర్వాత ఖాతాలో సరిపడా బ్యాలెన్స్‌ లేక ఏటీఎం లావాదేవీ విఫలమైతే విధించే ఛార్జీని కూడా రూ.17 నుంచి రూ.23 + జీఎస్టీకి పెంచింది. ఈ రుసుము కెనరా బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో జరిగే సంబంధిత లావాదేవీలకూ వర్తిస్తుంది.

ఇతర బ్యాంకుల ఏటీఎంలపై పరిమితి ఎంత?

కెనరా బ్యాంక్‌ డెబిట్‌ కార్డు ద్వారా ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తే నెలకు మెట్రో ప్రాంతాల్లో 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలు లభిస్తాయి. ఈ పరిమితి దాటిన తర్వాత నగదు ఉపసంహరణకు రూ.23 + జీఎస్టీ, నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలకు రూ.11 + జీఎస్టీ చెల్లించాలి.

మరోవైపు, గ్రీన్‌ పిన్‌ రీజనరేషన్‌ ఛార్జీ విషయంలో కస్టమర్లకు ఊరట లభించింది. ఉచిత లావాదేవీ పరిమితి దాటిన తర్వాత ఈ ఛార్జీని రూ.23 నుంచి రూ.5 + జీఎస్టీకి తగ్గించారు.

ఎస్‌బీఐ ఖాతాదారులకు అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన

ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ ‍బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ ఖాతాదారులకు అక్టోబర్‌ 1 నుంచి కొత్త మార్పు రానుంది. వీరు ఇతర బ్యాంకుల ఏటీఎంలు/డిపాజిట్‌ మిషన్లలో ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో చేసే ఉచిత నెలవారీ లావాదేవీల సంఖ్యను 10 నుంచి 5కు తగ్గిస్తున్నారు. ఈ 5 లావాదేవీల్లో ఫైనాన్షియల్‌, నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలు రెండూ లెక్కలోకి వస్తాయి. అంటే నగదు ఉపసంహరణతో పాటు బ్యాలెన్స్‌ ఎంక్వైరీ వంటి నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలు కూడా అదే ఐదు లావాదేవీల ఉచిత పరిమితిలో భాగమవుతాయి.

ఫ్రీ లిమిట్ దాటితే ఎంత?

ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు లభించే ఐదు ఉచిత లావాదేవీలను పూర్తిగా వినియోగించిన తర్వాత, ప్రతి అదనపు నగదు ఉపసంహరణకు రూ.23 + జీఎస్టీ చెల్లించాలి. నాన్‌-ఫైనాన్షియల్‌ లావాదేవీలకు రూ.11 + జీఎస్టీ కొనసాగుతుంది. అంటే అక్టోబర్‌ 1 నుంచి ప్రధాన మార్పు ఛార్జీల పెంపు కాదు.. ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గడం.

ఎస్‌బీఐ ఏటీఎంలలో మాత్రం మార్పు లేదు

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డుతో అదే ఎస్‌బీఐ ఏటీఎంలు/డిపాజిట్‌ మిషన్లు వినియోగించే విషయంలో ఈ అక్టోబర్‌ మార్పు వర్తించదు. ముఖ్యంగా ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజ్‌ అకౌంట్‌ ఖాతాదారులకు ఎస్‌బీఐ ఏటీఎంలలో ఉచిత లావాదేవీల విషయంలో ప్రస్తుత సదుపాయాలు కొనసాగుతాయి. ఇతర రకాల ఎస్‌బీఐ ఖాతాల ఉచిత లావాదేవీ పరిమితులు, సర్వీస్‌ ఛార్జీల్లోనూ ఈ నోటీసు ద్వారా మార్పు చేయలేదు.

అదేవిధంగా కార్డు లేకుండా (Cardless) నగదు ఉపసంహరణ చేసే లావాదేవీలపై కూడా ప్రస్తుత సదుపాయాల్లో మార్పు లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement