10 రూపాయల పవర్‌ చూపిస్తున్న అంబానీ! | Ambani Rs 10 power again Ice Cream Cool Drink market | Sakshi
Sakshi News home page

10 రూపాయల పవర్‌ చూపిస్తున్న అంబానీ!

Sep 3 2026 7:10 PM | Updated on Sep 3 2026 7:56 PM

Ambani Rs 10 power again Ice Cream Cool Drink market

భారత ఎఫ్‌ఎంసీజీ (FMCG) మార్కెట్‌లో రిలయన్స్‌ మరోసారి తన ‘తక్కువ ధర–భారీ పంపిణీ’ వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) తాజాగా ‘బాంబే క్రీమరీ’ పేరుతో ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బ్రాండ్‌లో ఐస్‌క్రీమ్‌ ధరలు కేవలం రూ.10 నుంచే ప్రారంభం కావడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బాంబే క్రీమరీ ఉత్పత్తులు పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి వచ్చాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్‌ ప్రణాళిక వేసింది. కప్పులు, కోన్స్‌, టబ్‌లు, బార్లు, స్టిక్స్‌ వంటి విభిన్న రూపాల్లో ఉత్పత్తులను అందించనుంది. కంపెనీ ప్రకారం వీటిని రియల్‌ డెయిరీ క్రీమ్‌తో  తయారు చేస్తున్నారు. అంటే కేవలం తక్కువ ధరపైనే కాకుండా, డెయిరీ ఆధారిత నాణ్యతను కూడా బ్రాండ్‌ ముందుకు తెస్తోంది.

అమూల్‌ నుంచి క్వాలిటీ వాల్స్‌ వరకు పోటీ..

ఐస్‌క్రీమ్‌ మార్కెట్లో ఇప్పటికే అమూల్‌, వడిలాల్‌, మదర్‌ డెయిరీ, క్వాలిటీ వాల్స్‌, అరుణ్‌ వంటి బలమైన బ్రాండ్లు ఉన్నాయి. వీటితో పాటు మ్యాగ్నమ్‌, బాస్కిన్‌ రాబిన్స్‌ వంటి ప్రీమియం బ్రాండ్లు కూడా పోటీలో ఉన్నాయి. ఇలాంటి పోటీ వాతావరణంలో రూ.10 ప్రారంభ ధరతో రిలయన్స్‌ ప్రవేశించడం మార్కెట్‌లో ధరల పోటీ మరింత పెరిగే అవకాశాలను సూచిస్తోంది.

రిలయన్స్‌కు ఈ వ్యూహం కొత్తది కాదు. టెలికాం రంగంలో జియో ప్రవేశం, పానీయాల విభాగంలో కాంపా పునరాగమనం సమయంలోనూ తక్కువ ధర, భారీ పంపిణీ వ్యవస్థ, అధిక రిటైల్‌ చేరువ వంటి అంశాలను కలిపి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు అదే మోడల్‌ను ఐస్‌క్రీమ్‌ మార్కెట్లోనూ అమలు చేయాలని చూస్తోంది.

కాంపాతో ఇప్పటికే సక్సెస్‌..

రిలయన్స్‌ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలో కాంపా ఈ వ్యూహానికి తాజా ఉదాహరణ. రిలయన్స్‌ అధికారిక గణాంకాల ప్రకారం FY26లో కాంపా రూ.4,700 కోట్లకు పైగా గ్రాస్‌ సేల్స్‌ సాధించింది. దీంతో దేశంలోని కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌ బ్రాండ్లలో నాలుగో అతిపెద్ద బ్రాండ్‌గా ఎదిగింది. కీలక మార్కెట్లలో డబుల్‌ డిజిట్‌ మార్కెట్‌ షేర్‌ను కూడా సాధించినట్లు కంపెనీ తెలిపింది.

ఇదే సమయంలో ఆర్‌సీపీఎల్‌ మొత్తం గ్రాస్‌ రెవెన్యూ FY26లో సుమారు రూ.22,000 కోట్లకు చేరింది. కాంపా, ఇండిపెండెన్స్‌, ప్యాకేజ్డ్‌ వాటర్‌ వంటి విభాగాల్లో విస్తరణతో రిలయన్స్‌ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

క్వాలిటీ వాల్స్‌కు షాక్‌..

బాంబే క్రీమరీ ప్రకటన ప్రభావం స్టాక్‌ మార్కెట్లోనూ కనిపించింది. రిలయన్స్‌ ఐస్‌క్రీమ్‌ మార్కెట్లోకి ప్రవేశించిన నేపథ్యంలో క్వాలిటీ వాల్స్‌ ఇండియా షేరు సెప్టెంబర్‌ 2న ఇంట్రాడేలో దాదాపు 3 శాతం పడిపోయి రూ.43 స్థాయికి చేరింది. వరుసగా ఏడో సెషన్‌లోనూ షేరు నష్టాల్లో ముగిసింది. ఈ ఏడు సెషన్లలో మొత్తం క్షీణత సుమారు 11 శాతంగా నమోదైంది.

ఇదీ చదవండి: ‘ఏటీఎం’ కీలక మార్పులు.. కెనరా, ఎస్‌బీఐ కొత్త రూల్స్ ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement