పిల్లల బాల్యాన్ని కాపాడాలి | PM Narendra Modi Meeting with National Award-Winning Teachers | Sakshi
Sakshi News home page

పిల్లల బాల్యాన్ని కాపాడాలి

Sep 6 2026 4:58 AM | Updated on Sep 6 2026 5:45 AM

PM Narendra Modi Meeting with National Award-Winning Teachers

డ్రగ్స్‌ వ్యసనం నుంచి దూరం చేయాలి  

క్రీడలు, సృజనాత్మక కార్యకలాపాలతో విద్యార్థుల్లో స్క్రీన్‌ టైమ్‌ తగ్గించాలి  

ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వ్యసనం పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పిల్లలను క్రీడలు, శారీరక వ్యాయామం, సృజనాత్మక కార్యకలాపాల వైపు ప్రోత్సహించాలని, తద్వారా వారు సెల్‌ఫోన్లతో ఎక్కువ సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డుకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ వీడియోను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి సంభాషించారు. పిల్లల బాల్యాన్ని కాపాడాలని, వారిలో సహజ కుతూహలాన్ని పెంపొందించాలని చెప్పారు. తరగతి గది అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చడానికి సృజనాత్మక పద్ధతులను ఎంచుకోవాలని అన్నారు. చదువులు మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తన, దైనందిన జీవితం పట్ల కూడా శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు. 

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థుల జీవితాల్లో టీచర్లు మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వారికి సరైన మార్గనిర్దేశం చేస్తూ ఉజ్వల భవిష్యత్తు వైపు ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు.  విద్యార్థుల్లోనూ డ్రగ్స్‌ వ్యసనం పెరిగిపోతుండడం పట్ల ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 

పెద్ద నగరాలు, విశ్వవిద్యాలయాల్లో ఎవరు ఎవరికి ఏమి ఇస్తున్నారో తెలియడం లేదని, దీనివల్ల డ్రగ్స్‌ బారిన పడిన వారిని గుర్తించడం కష్టమని అన్నారు. అందుకే విద్యార్థుల్లో డ్రగ్స్‌ ముప్పుపై తగిన అవగాహన కల్పించడానికి టీచర్లే చొరవ తీసుకోవాలని చె ప్పారు. డ్రగ్స్‌ అలవాటు ఉన్నట్లు గుర్తిస్తే వారి ని ఆ వ్యసనం నుంచి దూరం చేయాలని పే ర్కొన్నారు. వారి జీవితాల్లో బాల్యాన్ని సజీవంగా ఉంచడం ద్వారా ఉపాధ్యాయులు గొప్ప సహకారాన్ని అందించగలరని వెల్లడించారు.

నిజ జీవిత నైపుణ్యాలతో అనుసంధానించాలి  
విద్యార్థుల్లో స్క్రీన్‌ టైమ్‌ పెరిగిపోవడం ఒక ప్రధాన సమస్యగా మారిందని ప్రధానమంత్రి చెప్పారు. పిల్లలు స్క్రీన్‌పై ఎంత సమయం గడుపుతున్నారు? రాత్రిపూట మొబైల్‌ ఫోన్లు ఎన్ని గంటలు వాడుతున్నారు? అనేదానిపై వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. క్రీడలు, శారీరక శ్రమతో కూడిన ఆటలు, సృజనాత్మక కార్యకలాపాలు, కళలపై ఆసక్తిని పెంపొందించుకోవడం ద్వారా స్క్రీన్‌ సమయాన్ని సహజంగా తగ్గించవచ్చని స్పష్టంచేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement