అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేకు చేరువలోనే ఓ చార్టర్ విమానం కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా పైలట్లు రన్‌వేను చూడలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
ప్రమాదానికి గురైన సెస్నా 441 (Cessna 441 Conquest) విమానం.. అలాస్కాలోని యాంకరేజ్ నుంచి బయలుదేరి కేప్ న్యూవెన్‌హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తోంది. గురువారం మధ్యాహ్నం ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానాన్ని యాంకరేజ్‌కు చెందిన సెక్యూరిటీ ఏవియేషన్ సంస్థ నిర్వహిస్తోంది.
రెండోసారి ల్యాండింగ్.. క్షణాల్లో విషాదం
విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్లు మొదట ప్రయత్నించినా.. దట్టమైన పొగమంచు కారణంగా రన్‌వే కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అనంతరం రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించే సమయంలో విమానం రాడార్ సంబంధాలు కోల్పోయి కూలిపోయింది. రన్‌వేకు సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) అధికారులు మాట్లాడుతూ.. పైలట్లు బయట పరిస్థితులను చూడలేని స్థాయిలో ఉండడంతో కేవలం విమాన పరికరాల ఆధారంగానే నడిపినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మూడు వైపులా కొండలతో ఉన్న క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు కలిగిన ప్రాంతమని చెప్పారు.
మృతుల్లో..
ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో అమెరికా ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మరో నలుగురు కాంట్రాక్టర్లు. వీరంతా రాడార్ కేంద్రానికి సంబంధించిన పనుల కోసం ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని సహాయక బృందాలు ధ్రువీకరించాయి. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
మారుమూల సైనిక రాడార్ కేంద్రం వద్ద ప్రమాదం
ప్రమాదం జరిగిన కేప్ న్యూవెన్‌హామ్ లాంగ్ రేంజ్ రాడార్ సైట్ అలాస్కాలోని నైరుతి తీరంలో ఉంది. యాంకరేజ్ నగరానికి ఇది సుమారు 725 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రాడార్ కేంద్రం అలాస్కా గగనతలాన్ని, సరిహద్దు ప్రాంతాల్లోని విమానాల కదలికలను పర్యవేక్షించే నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేస్తుంది.
వేగంగా మారిన వాతావరణం
ప్రమాదానికి ముందు ఆ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారినట్లు అధికారులు తెలిపారు. మొదట కొంత దృశ్యమానత ఉన్నప్పటికీ.. కొద్ది సమయంలోనే దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఈ ప్రమాదంపై ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు ప్రారంభించింది. వాతావరణ పరిస్థితులు, పైలట్ల నిర్ణయాలు, విమానం సాంకేతిక పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అలాస్కా కమాండ్ అధికారులు మృతులను “కఠిన పరిస్థితుల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంకితభావం కలిగిన నిపుణులు”గా పేర్కొంటూ సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: భారతీయుల కిడ్నాప్ కలకలం.. ఎక్కడో తెలుసా?


