ఇరాన్‌ దెబ్బతో ట్రంప్‌ షాకింగ్‌ డెసిషన్‌?! | Really Iran Threat Trump Pulls All B 1 Bombers Out of UK Base | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ దెబ్బతో ట్రంప్‌ షాకింగ్‌ డెసిషన్‌?!

Oct 6 2026 1:49 PM | Updated on Oct 6 2026 2:23 PM

Really Iran Threat Trump Pulls All B 1 Bombers Out of UK Base

పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లోని కీలకమైన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫెయిర్‌ఫోర్డ్‌ స్థావరం నుంచి తమ బి-1 బాంబర్లన్నింటినీ వెనక్కి తరలించింది. ఇరాన్‌ ముప్పు ఉందన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఈ తరలింపుపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాత్రం మరో కారణం చెబుతున్నారు. 

లండన్‌కు సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫెయిర్‌ఫోర్డ్‌ స్థావరంలో అమెరికా సుమారు 12 బి-1 బాంబర్లను మోహరించింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యల్లో ఈ స్థావరం కీలకంగా మారింది. అయితే సెప్టెంబర్‌ 27న స్థావరానికి సమీపంలో ఐదుగురు యువకులను ఉగ్రవాద చర్యలకు సన్నాహాలు చేస్తున్నారన్న అనుమానంతో పోలీసులు అరెస్టు చేశారు. వారి వాహనాల్లో పేలుడు పదార్థాలు లభించకపోయినా కొంత పెట్రోల్‌ దొరికినట్లు పోలీసులు తెలిపారు. 

తొలుత వాళ్లు ఇరాన్‌ ఏజెంట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. మరో యూకే-ఇరాన్‌ ద్వంద్వ పౌరుడిని కూడా అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. ఈ పరిణామాల తర్వాత బాంబర్లను అమెరికాలోని స్వదేశీ స్థావరాలకు తరలించారు. 

దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ.. తమకు ముప్పు ఉందని సమాచారం వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో బాంబర్లను అక్కడే ఎందుకు ఉంచాలని ప్రశ్నించారు. ముప్పు సృష్టించిన వ్యక్తులు ఎవరన్నది తమకు తెలుసని కూడా చెప్పారు. ఆ ముప్పు ఇరాన్‌తో ముడిపడి ఉందా అని అడిగితే.. అవుననే అర్థం వచ్చేలా సమాధానం ఇవ్వడం కొసమెరుపు.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా బాంబర్ల తరలింపు ముందుజాగ్రత్త చర్యేనని చెప్పారు. తమ సైనిక సిబ్బంది భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని అమెరికా ఆస్తులకు ఇరాన్‌ నుంచి ముప్పు ఉందన్న అంచనాలు కొనసాగుతున్నాయని నాటో వర్గాలు కూడా తెలిపాయి.

రుబియో మాత్రం మరోలా.. 
ఇక్కడే అసలు ట్విస్ట్‌ మొదలైంది. బాంబర్ల తరలింపునకు బ్రిటన్‌లో జరిగిన అనుమానిత కుట్రతో నేరుగా సంబంధం ఉందని చెప్పలేమని విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పష్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ అవసరాన్ని బట్టి ప్రపంచవ్యాప్తంగా తన సైనిక వనరులను ఎప్పటికప్పుడు పునర్వ్యవస్థీకరిస్తుంటుందని చెప్పారు. అంటే ఓవైపు ట్రంప్‌ ఇరాన్‌ ముప్పును ప్రస్తావిస్తుండగా.. రుబియో మాత్రం ఈ రెండు పరిణామాలను నేరుగా ముడిపెట్టకపోవడం గమనార్హం.

ఫెయిర్‌ఫోర్డ్‌ ఎందుకంత కీలకం?
ఫెయిర్‌ఫోర్డ్‌ అమెరికాకు యూరప్‌లో అత్యంత కీలకమైన బాంబర్‌ స్థావరాల్లో ఒకటి. భారీ బాంబర్లను నిర్వహించగల అరుదైన వైమానిక స్థావరాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా ఇరాన్‌పై చేపట్టిన చర్యల్లో ఇక్కడి నుంచి బాంబర్లు కార్యకలాపాలు సాగించాయి. అమెరికా నుంచి నేరుగా పశ్చిమాసియాకు వెళ్లడం కంటే ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తే దూరం, సమయం తగ్గుతాయి. అందుకే ఈ స్థావరం నుంచి బాంబర్లను వెనక్కి తరలించడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే బాంబర్లను అమెరికాకు తరలించినంత మాత్రాన ఇరాన్‌పై దాడి చేసే అమెరికా సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయినట్లు కాదంట!. పెంటగాన్‌ ప్రకారం.. అమెరికా బాంబర్‌ బలగాలు ప్రపంచవ్యాప్తంగా అవసరమైన చోట ఖచ్చితమైన దాడులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నాయి. అయితే ఫెయిర్‌ఫోర్డ్‌ నుంచి లభించే వేగవంతమైన ప్రాంతీయ స్పందన సామర్థ్యం మాత్రం తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని రక్షణ నిపుణులు చెబుతున్నారు.

ఇరాన్‌ రియాక్షన్‌ ఏంటంటే.. 
ఫెయిర్‌ఫోర్డ్‌ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మరోవైపు బ్రిటన్‌ ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌ మాత్రం ఈ కుట్ర వెనుక ఇరాన్‌ ప్రమేయం ఉండొచ్చని ఇంతకు ముందు ప్రకటించారు. దీంతో అసలు కుట్రకు ఎవరు తెర వెనుక ఉన్నారన్నది ఇంకా పూర్తిగా తేలలేదు.

ఉన్నట్లుండి ఎందుకు వెనక్కి తగ్గారు?
ఇక్కడే ఇప్పుడు కీలక ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఇరాన్‌ ముప్పును ప్రస్తావించగా.. ఆయన విదేశాంగ మంత్రి మాత్రం నేరుగా సంబంధం లేదంటున్నారు. మరోవైపు ఫెయిర్‌ఫోర్డ్‌ సమీపంలో అరెస్టులు, ఇరాన్‌ నుంచి గతంలో వచ్చిన హెచ్చరికలు, అమెరికా బాంబర్ల ఆకస్మిక తరలింపు.. ఇవన్నీ ఒకేసారి చోటుచేసుకున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఖచ్చితమైన సంబంధం ఏమిటన్నది అమెరికా అధికారికంగా పూర్తిగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఫ్లైదుబాయ్‌ ఫ్లైట్‌ను కూల్చేయాలనుకున్న ఇజ్రాయెల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement