ముంబై: ప్రముఖ టీవీ షో 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజేశ్ కుమార్ నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఘటన తన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని తెలిపారు. తన సోదరుడి కుమార్తె నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ, పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దవడంతో మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని ఒక పాడ్‌కాస్ట్ షోలో చెప్పారు. నీట్‌లో మంచి మార్కులు సాధించిన ఆనందంతో తన సోదరుడు.. కుమార్తెను వైష్ణోదేవి ఆలయానికి తీసుకెళ్లారని రాజేశ్ తెలిపారు. అయితే ఆ ప్రయాణంలోనే ఆయన మరణించారని వెల్లడించారు. ఇదే సమయంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని నిర్ణయించారన్నారు.
13 రోజులకే రీ-ఎగ్జామ్..
తండ్రి మరణించిన విషాదం నుంచి కుటుంబం తేరుకోకముందే తిరిగి నీట్ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చిందని రాజేశ్ చెప్పారు. సోదరుడి మరణించిన 13వ రోజునే పరీక్ష ఉండటంతో తానే విమానంలో ఢిల్లీకి వెళ్లి తన మేనకోడలిని పరీక్షకు తీసుకెళ్లానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు మరో ఏడాది పాటు సిద్ధమయ్యే అవకాశం కూడా లేదని తెలిపారు. విద్యార్థులు, వారి కుటుంబాలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణమైన వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో జరిగిన తప్పిదాలకు బాధ్యత ఎవరు తీసుకోవాలని ప్రశ్నించారు. పేపర్ లీక్ వంటి ఘటనలు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు కుటుంబాల జీవితాలపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
అవకాశాలు రావంటూ హెచ్చరిక
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బహిరంగంగా మాట్లాడాలని తాను భావించినప్పుడు ఓ నిర్మాత తనను హెచ్చరించారని రాజేశ్ వెల్లడించారు. వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ప్రభుత్వ విభాగాల నుంచి అవకాశాలు ఇవ్వవద్దంటూ లేఖలు వస్తాయని ఆ నిర్మాత చెప్పినట్లు వివరించారు. దీంతో నటీనటులు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు కూడా వెనుకాడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాకారులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని రాజేశ్ అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేని వారికి కూడా గళం వినిపించే వేదికలు అవసరమని పేర్కొన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సీజేపీ’ అవకాశం కల్పిస్తోందని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రముఖ హీరోకు ఎఫ్‌డీఏ నోటీసు.. హైకోర్టులో సవాల్ చేస్తూ..


