ఆ సిరా గుర్తులు.. పోరాటానికి చిహ్నాలు | Sakshi Exclusive Interview with AISA National President Neha Bora | Sakshi
Sakshi News home page

ఆ సిరా గుర్తులు.. పోరాటానికి చిహ్నాలు

Oct 10 2026 3:42 AM | Updated on Oct 10 2026 3:42 AM

Sakshi Exclusive Interview with AISA National President Neha Bora

విద్యార్థులు, యువత పోరాటాలతో కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది 

పారదర్శక ఎన్నికల ప్రక్రియ కోసం రాజీలేని పోరాటం చేస్తాం 

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుతోనే పౌరులకు గౌరవం 

‘సర్‌’ పేరుతో పేదలు, వలస కూలీలు, యువత ఓట్లు గల్లంతు 

జంతర్‌ మంతర్‌ నిరసన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే పోరాటం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా

అల్లు సూరిబాబు 
కుటుంబంలో అంతా బీజేపీకి మద్దతు ఇచ్చే వాతావరణం.. కానీ ఆమెది మాత్రం వామపక్ష భావజాలం. ఆర్మీ ఉద్యోగి అయిన తండ్రి నుంచి పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న ఆమె.. డిగ్రీ సోషియాలజీ విద్యార్థిగా ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత సమాజాన్ని చదివారు. తొలుత అక్కడ విద్యార్థుల సమస్యలపై నినదించిన ఆమె.. గళం ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో అక్రమాలపై ప్రశ్నిస్తోంది.

నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌లపై దేశ రాజధానిలోని జంతర్‌ మంతర్‌ వద్ద జూలైలో జరిగిన ఆందోళనలో ఒక పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించినా, రాంచీలో జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల అక్ర మాలు, పేపర్‌ లీకేజీలపై విద్యార్థుల ఆందోళనలో ఓ వ్యక్తి నల్లటి సిరా చల్లి దేశద్రోహి అని నిందించినా ఆమె మనోధైర్యం కోల్పోలేదు. ఆ సిరా గుర్తులు తన పోరాటానికి చిహ్నాలని చెబుతున్నారు. ఆమే అఖిల భారత విద్యార్థుల సంఘం (ఏఐఎస్‌ఏ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థి సంఘాలు శనివారం భారీ స్థాయిలో నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విష యాలపై తన అభిప్రాయాలను నేహా బోరా కుండబద్దలుకొట్టినట్లు వెల్లడించారు.

సాక్షి: సాధారణ విద్యార్థి స్థాయి నుంచి దేశం దృష్టిని ఆకర్షించిన ప్రధాన విద్యార్థి సంఘ సారథిగా మారడం ఎలా సాధ్యమైంది? 
నేహా: ఉత్తరాఖండ్‌లోని ఖటీమా ప్రాంతం మా స్వస్థలం. మా నాన్న సైన్యంలో ఉద్యోగి. అమ్మ సాధారణ గృహిణి. నాన్న ఉద్యోగ రీత్యా నా బాల్యమంతా వేర్వేరు ప్రాంతాల్లో గడిచింది. పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్‌ కోసం ఢిల్లీలో అడుగుపెట్టాను. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ హిందూ కాలేజీలో బీఏ సోషియాలజీలో చేరాను. తర్వాత ఢిల్లీలోనే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ చేశాను.

థియేటర్‌ ఆర్ట్స్, స్ట్రీట్‌ ప్లే (వీధి నాటకాలు) ఆసక్తితో ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఈస్థటిక్స్‌లో థియేటర్‌ అండ్‌ పెర్ఫార్మెన్స్‌ స్టడీస్‌ విభాగంలో పీహెచ్‌డీ రీసెర్చ్‌ స్కాలర్‌గా పరిశోధన చేస్తున్నాను. థియేటర్‌ ఆర్ట్స్‌పై ఆసక్తితోనే ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే సంగవారి అనే ప్రసిద్ధ థియేటర్‌ గ్రూప్‌తో కలిసి పనిచేశాను.

ఈ నేపథ్యమే నాలో ప్రాథమికంగా రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. సమాజంలోని పేదరికం, విద్యా వ్యవస్థలోని లోపాలు, మహిళలకు భద్రత కొరవడటం, సామాజిక అసమానతలను ప్రత్యక్షంగా చూశాను. అలా ప్రజాపోరాటాల వైపు వచ్చాను. ఏఐఎస్‌ఏలో క్రియాశీల సభ్యురాలిగా మారాను. జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థుల సమస్యలపై ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నాను. దీంతో నా ప్రసంగ శైలితోపాటు నిర్వహణ సామర్థ్యాల వల్ల ఏఐఎస్‌ఏ ఢిల్లీ యూనిట్‌లో కీలక పదవులకు ఎంపికయ్యాను. ఆ తర్వాత జాతీయ అధ్యక్షురాలిగానూ ఎన్నికయ్యాను. అలా దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం కలిగింది. 

విద్యార్థి, యువజన ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగొస్తాయని భావిస్తున్నారా? 
కచ్చితంగా! విద్యార్థులు, యువత ఉద్యమాలకు ప్రభుత్వాలు దిగొచ్చిన తార్కాణాలు చరిత్రలో చాలా ఉన్నాయి. శాంతియుత ఉద్యమాలకు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వాలి. వాటిని పోలీసు బలగాలతో అణచివేయడం కాదు,.. వారి సమస్యలను సానుకూలంగా స్పందించాలనే ఆలోచనా ధోరణి ప్రభుత్వానికి, పాలకులకు ఉండాలి. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే శాంతియుత నిరసనలు కాస్తా హింసాయుతంగా మారుతున్నాయి.

ఇటీవల కాలంలో నేను స్వయంగా పాల్గొన్న ఉద్యమాలనే తీసుకుంటే యువత, విద్యార్థుల ఉద్యమస్ఫూర్తిని సమాజం అభినందించాల్సిందే. ప్రభుత్వాలు దిగొచ్చాయి. నీట్‌–యూజీ ప్రవేశపరీక్షల అక్రమాలు, పేపర్‌ లీకేజీలపై విద్యార్థులు, యువత నిర్వహించిన నిరాహార దీక్షలు, నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఈ లీకేజీ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తుకు అప్పగించింది. కఠినమైన యాంటీ పేపర్‌ లీక్‌ చట్టం తీసుకొచ్చింది. నీట్‌ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరును సమీక్షించడానికి ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

తర్వాత జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల అక్రమాలు, లీకేజీలపై ఇటీవల రాంచీలో విద్యార్థులు నిర్వహించిన ఆందోళనకు అక్కడి ప్రభుత్వం దిగొచ్చింది. అక్రమాలపై సమగ్ర విచారణకు ఆదేశించింది. భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షల్లో పేపర్‌ లీకేజీలు పునరావృతం కాకుండా కఠినమైన యాంటీ పేపర్‌ లీక్‌ నిబంధనలను వర్తింపజేస్తామని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ల తొలగింపు వ్యవహారం యువత, విద్యార్థి సంఘాల నిరసనలతోనే సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. 
 
ఢిల్లీలో నేడు ‘చలో ఢిల్లీ’పిలుపుతో నిరసన వెనుక ప్రధాన ఉద్దేశమేమిటి? 
ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హక్కుతోనే గౌరవం ఏర్పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే అది వారి ఉనికికి నిదర్శనం. ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రభుత్వం. కానీ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ఓటు హక్కే ప్రమాదంలో పడింది. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు గల్లంతవుతున్న వారిలో ఎక్కువ మంది పేదలు, శ్రామిక వర్గానికి చెందినవారు, యువతే ఉంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని ఓఖ్లా, మంగోల్‌పురి, జామియానగర్‌లలో చూస్తే చాలా మంది పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తీసేశారు.

ఎవరికి వారు ఒక్క ఓటే కదా అనుకుంటే భవిష్యత్తులో ప్రశ్నించే గొంతుకే ఉండదు. ఓటర్ల జాబితాల సమగ్ర పరిశీలన (సర్‌) పేరుతో జరుగుతున్న అక్రమ తొలగింపులకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని బాధ్యులను చేయడానికే శనివారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద శాంతియుత నిరసనకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ), విద్యార్థి సంఘాలు సమష్టిగా పిలుపునిచ్చాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలి, ఎన్నికల వ్యవస్థలో అక్రమాలను చక్కదిద్దాలి, సర్‌ ప్రక్రియ నిలిపేసి రానున్న ఎన్నికలను పాత ఓటర్ల జాబితాలతోనే నిర్వహించాలనే డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాం. 

సీజేపీతో కలిసి పనిచేయడం భవిష్యత్తులో పొత్తుకు దారితీస్తుందా? 
ఏఐఎస్‌ఏ, సీజేపీ భిన్న దృక్ఫథాలతో పనిచేస్తున్న సంస్థలు. రెండింటి ఆలోచనా విధానం, సిద్ధాంతాలు ఒక్కటి కావు. మాది స్పష్టమైన వామపక్ష విద్యార్థి ఉద్యమం. దీప్కే తదితర సీజేపీ నాయకులు కూడా ఏ మార్గంలో వెళ్లాలో ఒక స్పష్టమైన విధానాన్ని నిర్ణయించుకున్నారు. కాబట్టి రెండు సంఘాల మధ్య సమన్వయం కేవలం ఒక అంశం లేదా ఎజెండా ఆధారంగానే ఉంటుంది. అయితే జూలైలో మేము జంతర్‌ మంతర్‌ వద్ద సుదీర్ఘ పోరాటం కలిసి చేశాం. అలాగే ఇప్పుడు ఓటు చోరీ పోరాటంలోనూ భాగస్వాములమయ్యాం. నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ (ఐవైసీ)లనూ భాగస్వాములను చేయడానికి మేము సంప్రదిస్తున్నాం. 

‘చలో ఢిల్లీ’భగ్నానికి కేంద్రం ప్రయత్నాల నేపథ్యంలో మీ కార్యాచరణ ఎలా ఉంటుంది?  
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు రాజ్యాంగం ఇచ్చింది. శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చాం. కానీ వారు తిరస్కరించారు. జంతర్‌మంతర్‌ను మూసేశారు. వాస్తవానికి అదొక అధికారిక నిరసన ప్రదేశం. కానీ అది కాగితాలకే పరిమితమైంది. ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకున్న, తొలగించిన ప్రతిదానినీ తిరిగి స్వాధీనం చేసుకోవడమే శనివారం నాటి నిరసన వెనుక ఉన్న మా ప్రధాన ఉద్దేశం. ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి లేకుండాపోయిన జంతర్‌ మంతర్‌ నుంచే ఇది ప్రారంభమవుతుంది. నిరసన తెలిపే హక్కునూ తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాం. 

విద్యార్థి సంఘాల శాంతియుత నిరసనలు ఎందుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి? 
మా నిరసన ప్రదర్శనల్లో ఎవరూ ఉద్దేశపూర్వకంగా హింసాత్మక ఘటనలకు దిగడంలేదు. బారికేడ్లు దాటి పార్లమెంటు వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తే సెక్షన్‌ 163 నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగిస్తున్నారు. నిరసనకారులను, మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకొనే క్రమంలో మగ పోలీసులు భౌతిక దాడులకు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. 

నేనూ బాధితురాలినే. నాపైనా దాడులు జరిగాయి. వాటిపై ఫిర్యాదు చేసినా పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌లో తొలుత ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు కేసు నమోదు చేసి ఢిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కానీ ప్రభుత్వం భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే ప్రజలు భయంతో బతుకుతూ ఎప్పటికీ గళం విప్పకుండా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉంటారని పాలకులు అనుకుంటే పొరపాటే. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి శాంతియత నిరసనలు చేస్తాం. హాస్యాన్ని, వ్యంగ్యాన్ని నిరసనలో భాగం చేస్తాం. అదే యువత, జెన్‌జీ చేతిలో ఉన్న ఒక ఆయుధం. 

నిరసనకారులపై భౌతిక దాడుల ఉదంతాల నేపథ్యంలో మీరు భయపడుతున్నారా? 
జేపీఎస్‌సీ–జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అక్రమాలపై నిరసనగా జార్ఖండ్‌ అసెంబ్లీ వైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు జన సమూహంలో నుంచి ఓ వ్యక్తి హఠాత్తుగా దూసుకొచ్చి నా ముఖంపై, దుస్తులపై నల్లటి సిరా చల్లాడు. నన్ను దేశద్రోహి అంటూ ఏవేవో ఆరోపణలు చేశాడు. జూలై 20న ఢిల్లీలో జరిగిన నిరసనలో మాపై బాష్పవాయు గోళాలు, పెల్లెట్లు ప్రయోగించారు. వాటికే భయపడని మేము సిరా చల్లితే బెదిరిపోతామా? ఆ సిరా గుర్తులు నా పోరాటానికి, నా ధైర్యానికి చిహ్నాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement