సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల కోచింగ్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ స్కూళ్లలో 29 యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
29 జిల్లాల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలకు ఈ జాబితాలో మినహాయింపు ఇచ్చారు. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఐఐటీ–జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఐఐటీ–జేఈఈ, నీట్ కేంద్రాల్లో ఆరుగురు చొప్పున, క్లాట్ కేంద్రాల్లో ఐదుగురు చొప్పున బోధనా సిబ్బందిని నియమించనున్నారు. అర్హతలు, బోధనానుభవం, సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యం ఆధారంగా పార్ట్టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన అధ్యాపకులు గంటల ప్రాతిపదికన 152 పని దినాలపాటు విద్యార్థులకు బోధించనున్నారు. కాన్సెప్ట్ ఆధారిత బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, సందేహాల నివృత్తి, అసైన్మెంట్లు, మాక్ టెస్టులు, వెనుకబడిన విద్యార్థులకు అదనపు సహాయం అందించనున్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం రూ.3.73 కోట్లను విడుదల చేసింది. పథకం ద్వారా 29 కేంద్రాల్లోని 3,920 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఇదీ చదవండి: ఐఐటీ హైదరాబాద్లో మంచితనంపై కోర్స్!
22న సీపీగేట్–2026 మూడో జాబితా
ఉస్మానియా యూనివర్సిటీ: టీజీ సీపీగేట్–2026 కౌన్సెలింగ్లో భాగంగా వివిధ పీజీ కోర్సులలో సీటు సాధించిన విద్యార్థుల మూడో జాబితాను ఈ నెల 22న ప్రకటించనున్నట్లు అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి గురువారం తెలిపారు.
ఓయూతో పాటు రాష్ట్రంలోని 8 వర్సిటీలలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులలో ప్రవేశాలకు జరిగిన 1, 2వ ఆన్లైన్ కౌన్సెలింగ్ల అనంతరం మిగిలిన 30 వేల సీట్లకు 3వ విడత కౌన్సెలింగ్కు 13 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. అందులో సుమారు 6 వేల మందికి సీట్లను కేటాయించనున్నట్లు చెప్పా రు. ఇక రెండో విడత కౌన్సెలింగ్ సీటు సాధించిన విద్యార్థులు ఈ నెల 17 వరకు ఆయా కాలేజీలలో రిపోర్టు చేయవచ్చని ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చు.


