లండన్‌ టూ ఇండియా.. ఫ్లాట్‌లో మిస్టరీ డెత్‌.. ఆన్‌లైన్‌ ఆర్డర్లే అసలు క్లూ! | Mugdha Deshmukh Death Mystery At Pune Over London Return | Sakshi
Sakshi News home page

లండన్‌ టూ ఇండియా.. ఫ్లాట్‌లో మిస్టరీ డెత్‌.. ఆన్‌లైన్‌ ఆర్డర్లే అసలు క్లూ!

Oct 31 2026 8:59 AM | Updated on Oct 31 2026 8:59 AM

Mugdha Deshmukh Death Mystery At Pune Over London Return

ఫోన్‌లో పలకరింపులు.. మెసేజ్‌లతో క్షేమ సమాచారాలు.. తాను లండన్‌లోనే ఉంటూ ఎంబీఏ చదువుకుంటున్నానని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించింది. కానీ తెరవెనుక కథ వేరుగా ఉంది. ఎవరికీ చెప్పకుండా భారత్‌కు తిరిగొచ్చింది. పూణేలో ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌! ఎక్కడ వెతికినా తన ఆచూకీ లేదు. చివరకు బ్యాంక్‌ ఖాతాను పరిశీలించడంతో అసలు కథలో కీలక మలుపు తిరిగింది. ఫుడ్‌ డెలివరీ, ఆన్‌లైన్‌ సేవల లావాదేవీలు ఆమె పూణేలో ఉన్నట్లు తేలింది. పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. 34 ఏళ్ల ముగ్ధ విగతజీవిగా కనిపించింది. లండన్‌ నుంచి తిరిగొచ్చిన ఆమె.. కుటుంబానికి దూరంగా ఎందుకు ఉంది? ఆమె మరణం వెనుక ఏం జరిగింది? ఇప్పుడు ఈ ప్రశ్నలే మిస్టరీగా మారాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ముగ్ధ అవినాశ్ దేశ్‌ముఖ్‌(34) ఎంబీఏ చదివేందుకు 2025 జులైలో లండన్ వెళ్లింది. అయితే ఈ ఏడాది ఆగస్టులోనే ఆమె భారత్‌కు తిరిగొచ్చింది. పూణేలోని పింప్రి చించ్వాడ్ పరిధిలో గహుంజేలో ఉన్న లోధా బెల్మోండో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడే ఉంటోంది. గురువారం ఆమె అదే ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది.

ఫుడ్‌ డెలివరీ లావాదేవీలతో ఆచూకీ..
ముగ్ధ అక్టోబర్ 24 నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో అందుబాటులో లేకుండా పోయింది. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌ రావడంతో తండ్రి అవినాశ్‌ దేశ్‌ముఖ్‌ లండన్‌లో ఉన్న ఆమె స్నేహితురాలిని సంప్రదించారు. అక్టోబర్ 22న చివరిసారిగా ముగ్ధతో మాట్లాడినట్లు ఆమె తెలిపింది. అంతేకాకుండా ముగ్ధ ఆగస్టు నెలాఖరులోనే బ్రిటన్‌ను విడిచివెళ్లినట్లు లండన్ పోలీసుల ద్వారా తెలుసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు భారత అధికారులను సంప్రదించారు. మరోవైపు తండ్రి ఆమె బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించగా అక్టోబర్ 8 నుంచి 25 మధ్య ఫుడ్‌ డెలివరీ, ఇతర ఆన్‌లైన్ సేవలకు సంబంధించిన పలు లావాదేవీలు కనిపించాయి. వాటిలో ఒక లావాదేవీ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతం నుంచి జరిగినట్లు అనుమానం రావడంతో ఆమె భారత్‌కు తిరిగొచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. వెంటనే స్థానిక క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు.

ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా..
ఛత్రపతి శంభాజీనగర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ముగ్ధ ఆచూకీని గుర్తించారు. పూణేలోని గహుంజేలో ఆమె ఉంటున్న ఫ్లాట్‌ను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. షిర్‌గావ్ పోలీసులు తాళాలు తెరిచే వ్యక్తి సాయంతో ఫ్లాట్‌లోకి ప్రవేశించగా ముగ్ధ మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. ముగ్ధ ఏప్రిల్‌లోనే ఆ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నప్పటికీ.. ఆగస్టులో బ్రిటన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాతే అక్కడ నివసించడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతికి కారణం ఏంటి?
ముగ్ధ మృతికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టంలోనూ మరణానికి గల కారణం నిర్ధారణ కాలేదు. ఆమె లండన్‌ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్లింది? కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఒంటరిగా ఎందుకు ఉంటోంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. నిరుద్యోగులకు విజయ్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement