బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారు సమీపంలో జరిగిన కాల్పుల ఘటనతో చిత్రపరిశ్రమలో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆయన కారు సమీపంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడగా, దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిట్ ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా, గత రెండేళ్లుగా మహారాష్ట్రలోని ముంబై, పూణె నగరాలను ప్రధాన కేంద్రాలుగా మార్చుకుని 10కి పైగా తీవ్రమైన నేరాలకు పాల్పడింది. ముంబైలో హై ప్రొఫైల్ సినీ ప్రముఖులను, పుణెలో స్థానిక బడా వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా బెదిరింపులకు, దందాలకు పాల్పడుతోంది.
ఉత్తరాది రాష్ట్రాల షూటర్ల సాయంతో..
పోలీస్ వర్గాల క్రైమ్ డేటా ప్రకారం 2024 నుంచి 2026 మధ్య కాలంలో పుణె, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో బిష్ణోయ్ ముఠాతో సంబంధం ఉన్న పదికి పైగా ఎక్స్‌టార్షన్ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో తలదాచుకున్న కీలక సూత్రధారులు, స్థానిక కాంటాక్టులు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి రప్పించిన షూటర్ల ద్వారా ఈ నేర నెట్‌వర్క్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ ముఠా కార్యకలాపాలను విస్తరించడంలో పూణెకు చెందిన శుభమ్ లోంకర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం మహారాష్ట్రలోని వివిధ జైళ్లలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 50 మందికి పైగా సభ్యులు ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ కార్యకలాపాలు ఆగకపోవడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ వద్ద..
మహారాష్ట్రలో ఈ గ్యాంగ్ సాగించిన ప్రధాన నేరాల క్రమాన్ని పరిశీలిస్తే, 2024 ఏప్రిల్ 14న బాంద్రాలోని నటుడు సల్మాన్ ఖాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో పోలీసులు ‘మకోకా’ చట్టాన్ని ప్రయోగించి లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్‌లతో సహా పలువురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అనంతరం 2024 అక్టోబర్ 12న బాంద్రా ఈస్ట్‌లో ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. ముంబైలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడంతో పాటు సల్మాన్ ఖాన్‌తో ఆయనకున్న సాన్నిహిత్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
రూ.50 కోట్లు వసూలు చేసేందుకు..
2026 ఫిబ్రవరి 1న దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. 2026 మే నెలలో పింప్రి-చించ్వాడ్‌లోని ఏజే ఫర్నిచర్ మాల్‌పై రెండు కోట్ల రూపాయల దందా డిమాండ్ చేస్తూ ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే ఏడాది జూన్ 22న పుణెలోని ఫుర్సుంగి ప్రాంతంలో ఒక వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి, ఆయనతో పాటు తొమ్మిది మంది భాగస్వాముల నుంచి ఏకంగా రూ.50 కోట్ల రూపాయల వరకు వసూలు చేసేందుకు యత్నించారు. తాజాగా టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా జరిగిన కాల్పుల కేసులో ఇప్పటికే పోలీసులు పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.
టార్గెట్‌లో వీరంతా..
ఈ గ్యాంగ్ ప్రధానంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై జైళ్లలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 56 మంది వరకు ఖైదీలుగా ఉండగా, అందులో 31 మంది కేవలం బాబా సిద్ధిఖీ హత్య కేసులోనే ఉన్నారు. అయినప్పటికీ కొత్త షూటర్లను రంగంలోకి దించుతూ, తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, ఆమిర్ ఖాన్, రోహిత్ శెట్టి, ఆయుష్ శర్మ, కపిల్ శర్మ, మునావర్ ఫారూఖీ, టైగర్ ష్రాఫ్‌లతో పాటు పంజాబ్, హర్యానాలకు చెందిన పలువురు ప్రముఖ గాయకులు, స్థానిక వ్యాపారులకు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెదిరింపులు వచ్చాయి.
ఇదీ చదవండి: ‘ధురంధర్’పై శశి థరూర్ సంచలన విశ్లేషణ


