డిజైన్ చేయాలన్నా.. ఫొటోలకు కొత్త రూపం ఇవ్వాలన్నా చాలామందికి గుర్తొచ్చే పేరు కాన్వా. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ డిజైన్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లో నిలిచింది. ఏకంగా 1,271 మంది ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 22 శాతం కావడం గమనార్హం.
కాన్వా సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ మెలానీ పెర్కిన్స్ నవంబర్ 4న ఉద్యోగులకు పంపిన సందేశంలో ఈ విషయాన్ని తెలిపారు. తమ 13 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇదే అత్యంత కఠినమైన నిర్ణయమని పేర్కొన్నారు. అయితే, ప్రభావితమయ్యే ఉద్యోగులందరూ ఉద్యోగాలు కోల్పోరు. కొందరి విధుల్లో మార్పులు చేయనుండగా, మరికొందరిని ఇతర నగరాలకు మారాలని కోరనున్నారు. ఇంకొందరికి సంస్థ నుంచి వీడ్కోలు తప్పదని తెలిపారు.
అయితే దాదాపు దశాబ్ద కాలంలో తొలిసారిగా కంపెనీ వ్యాపార వృద్ధి మందగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సీఈఓ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సంస్థ పని విధానాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న బృందాలతో వేగంగా నిర్ణయాలు తీసుకునేలా నిర్వహణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించనున్నారు. ప్రొడక్ట్, గ్రోత్, ప్లాట్‌ఫామ్ విభాగాలను ఒకే విభాగం కిందకు తీసుకురానున్నారు. అయితే, ఉద్యోగుల కోతలకు ఏఐ కారణమని సీఈఓ నేరుగా చెప్పలేదు.
మరోవైపు, ఆస్ట్రేలియాలోని సిడ్నీని సంస్థ ప్రధాన పని కేంద్రంగా మార్చేందుకు కాన్వా సిద్ధమవుతోంది. కొన్ని విభాగాలను అక్కడికి తరలించనుంది. ఉద్యోగులు సిడ్నీకి మారాల్సి వస్తే అవసరమైన సహాయం అందించనుంది. దీంతో వచ్చే జనవరి నుంచి హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులు వారానికి రెండు నుంచి మూడు రోజులు కార్యాలయానికి రావాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది.
ఉద్యోగాలు కోల్పోయే వారికి కనీసం ఆరు నెలల వేతనంతోపాటు చట్టబద్ధమైన ఇతర చెల్లింపులు అందించనున్నారు. కెరీర్ కోచింగ్, ఇంటర్వ్యూ సన్నద్ధతలో సహాయం, ఏడాది పాటు లింక్డ్‌ఇన్ ప్రీమియం సదుపాయం కల్పించనున్నారు. అలాగే కంపెనీ మ్యాక్‌బుక్‌లను తమ వద్దే ఉంచుకోవడంతోపాటు, కొత్త వ్యాపారం లేదా సామాజిక ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వారికి 10 వేల డాలర్ల గ్రాంట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశమూ కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో సంస్థ భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ మార్పులు.. 1,271 మంది ఉద్యోగుల జీవితాల్లో మాత్రం కొత్త సవాళ్లుగా మారింది.
ఇదీ చదవండి: అమెరికన్లే టార్గెట్.. ఫేక్ కాల్ సెంటర్లపై ఈడీ దాడులు.. ముగ్గురి అరెస్ట్


