అయోధ్య విరాళాల చోరీ కేసు..  ‘స్వతంత్ర దర్యాప్తు’ పిటిషన్ల కొట్టివేత  | Supreme Court Disposes Petitions as Charge Sheet Filed | Sakshi
Sakshi News home page

అయోధ్య విరాళాల చోరీ కేసు..  ‘స్వతంత్ర దర్యాప్తు’ పిటిషన్ల కొట్టివేత 

Nov 3 2026 6:44 AM | Updated on Nov 3 2026 6:44 AM

Supreme Court Disposes Petitions as Charge Sheet Filed

దిగువ కోర్టులో సిట్‌ చార్జిషిట్‌ వేసిందన్న సుప్రీంకోర్టు 

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్‌) ఇప్పటికే విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం సోమవారం తెలిపింది. 

దర్యాప్తు పూర్తయి చార్జిషీట్‌ దాఖలైనందున ఈ కేసును ఇక న్యాయపరంగా జ్యుడీషియల్‌ మేజి్రస్టేట్‌ పరిశీలిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్నందున, చట్టప్రకారం ఒక కేసులో బాధితులు ఎలాగైతే కోర్టుకు సహకరిస్తారో, అదే రీతిలో మేజిస్ట్రేట్‌కు సహకరించేందుకు పిటిషనర్లకు స్వేచ్ఛను ఇస్తున్నట్లు పేర్కొంది. విచారణ నిష్పాక్షికంగా సాగేందుకు వీలుగా.. కేసుపూర్వాపరాలపై తాము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. విరాళాల లెక్కింపు దశలోనే చోరీలు జరిగినట్లు సిట్‌ తేల్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించి 8 మంది నిందితులను గుర్తించి, సెప్టెంబర్‌ 23న అయోధ్య కోర్టులో వారిపై చార్జిషిట్‌ వేసిందని వెల్లడించారు. నిందితులు దొంగిలించిన నగదును ఆస్తుల కొనుగోలుకు, బ్యాంకు డిపాజిట్లకు మళ్లించినట్లు కూడా తేలిందన్నారు. ఆడిట్‌ ప్రక్రియ కూడా పూర్తయిందని, ఆలయంలోని కానుకలు, వస్తువులు, ఇతర కళాఖండాలన్నీ భద్రంగానే ఉన్నాయని నివేదించారు.

 భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ధర్మాసనానికి వివరించారు. విరాళాల చోరీ వ్యవహారం నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆర్థిక లావాదేవీలపై సమగ్ర స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలంటూ లాయర్‌ నరేంద్ర కుమార్‌ గోస్వామి, అజయ్‌ కుమార్‌ రాయ్, ఆర్జేడీ ఎంపీ సుధాకర్‌ సింగ్, హిందూ ధర్మ పరిషత్‌ పిటిషన్లు వేయడం తెల్సిందే. కాగా, ప్రధాన అయోధ్య వివాద కేసులో తీర్పునిచ్చిన భూమిలోనే రామమందిరం ఉందా లేదా అని నిర్ధారించాలంటూ దాఖలైన కొత్త పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు ధర్మాసనం తాజాగా నిరాకరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement