రాజస్తాన్‌లో తీవ్ర విషాదం  | 8 Workers Killed After Roadwork Machine Touches Power Line In Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో తీవ్ర విషాదం 

Nov 3 2026 6:30 AM | Updated on Nov 3 2026 6:30 AM

8 Workers Killed After Roadwork Machine Touches Power Line In Rajasthan

విద్యుత్‌ షాక్‌తో 8 మంది కార్మికులు మృత్యువాత 

రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఘటన

జైపూర్‌: రాజస్తాన్‌లోని ఝున్‌ఝునులో సోమ వారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్న మిక్సర్‌ యంత్రానికి విద్యుత్‌ తీగలు తాకడంతో షాక్‌కు గురై 8 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. ఘటనలో మరో ఐదుగురికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఉదయ్‌పూర్‌వటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఛపోలి గ్రామంలో ఛపోలి–కదమ్‌కుంద్‌ లింకు రోడ్డు నిర్మాణాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపట్టారు. అయితే, సోమవారం పనులు చేస్తున్న సమయంలో గ్రావెల్‌ను మిక్స్‌ చేసే మెషీన్‌కు ఆపైగా వెళ్తున్న హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలాయి. కరెంటు ప్రవహించడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులు షాక్‌కు గురయ్యారు. 

వారిలో ఎనిమిది మంది చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. బాధితులందరూ 22–32 మధ్య వయస్సు వారేనని పోలీసులు తెలిపారు. కాలిన గాయాలైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉదయ్‌పూర్‌వటి ఎస్‌హెచ్‌వో రాంపాల్‌ వివరించారు. ప్రధాని మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఎక్స్‌ వేదికగా ఆయన ప్రకటించారు. విషాద ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని సీఎం భజన్‌లాల్‌ శర్మ ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకుని, బాధితులకు సాయం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఝబర్‌ సింగ్‌ ఖర్రాను ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement