breaking news
Jhunjhunu
-
చితిపై బతికొచ్చాడు
జైపూర్: మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించిన ఓ వ్యక్తి శ్మశానంలో చితిపైకి చేర్చగానే శ్వాస పీల్చడం ప్రారంభించాడు. అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు తేలింది. దీంతో ఆంత్యక్రియలకు వచ్చినవారంతా షాక్ తిన్నారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడు. ఆశ్చర్యకరమైన ఈ సంఘటన రాజస్తాన్‌లోని జుంఝున్లో చోటుచేసుకుంది. ప్రాణంతో ఉన్న వ్యక్తి మరణించినట్లు ప్రకటించడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు వైద్యులను జుంఝునూ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 25 ఏళ్ల రోహితాశ్ కమార్ దివ్యాంగుడు. వినలేడు, మాట్లాడలేడు. అతడి కుటుంబం ఏమైందో, ఎక్కడుందో తెలియదు. అనాథగా మారాడు. అనాథాశ్రమంలో ఉంటున్నాడు. గురువారం హఠాత్తుగా అనారోగ్యం పాలయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో జుంఝునూ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అతడు చనిపోయినట్లు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్లు ప్రకటించారు. దాంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు గంటలపాటు అక్కడే ఉంచారు. పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తరలించారు. దహనం చేయడానికి చితిపైకి చేర్చారు. చితికి నిప్పంటించడానికి సిద్ధమవుతుండగా రోహితాశ్ శ్వాస పీల్చుకోవడం ప్రారంభించాడు. అతడు బతికే ఉన్నట్లు గుర్తించి వెంటనే అంబులెన్స్ రప్పించారు. జుంఝునూలోని బీడీకే హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగా, మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. బతికి ఉన్న వ్యక్తి మరణించినట్లు నిర్ధారించినందుకు జుంఝున్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సందీప్ పచార్తోపాటు మరో ఇద్దరు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Neeru Yadav: హాకీ వాలీ సర్పంచ్
రాజస్తాన్‌లో ఆడపిల్ల పుడితే ఇంకా కొన్ని పల్లెల్లో బంధువులు వెళ్లి ‘శోక్ ప్రకటన్’ (శోక ప్రకటన) చేసే ఆనవాయితీ ఉంది. మొదట కొడుకు పుట్టేశాక రెండో సంతానంగా ఆడపిల్ల పుడితే బిడ్డ బాగోగులు నిర్లక్ష్యం చేసే ఆనవాయితీ ఉండటంతో ప్రభుత్వం ఏకంగా రెండో సంతానం కోసమే ‘మాతృత్వ పోషణ్ యోజన’ పేరుతో తల్లికి 6 వేల రూపాయలు ఇస్తోంది. అలాంటి చోట ఒక మహిళా సర్పంచ్ హల్చల్ చేస్తోంది. తను సర్పంచ్ కావడమే ఊరిలోని ఆడపిల్లలతో ఒక హాకీ టీమ్ ఏర్పాటు చేసి ‘హాకీ వాలీ సర్పంచ్’ అనే పేరు గడించింది. తాజాగా హాకీ బ్యాట్ పట్టుకుని తిరుగుతూ పెళ్లిళ్లలో చెత్త చెదారం వేసినా, ఆహారాన్ని వ్యర్థం చేసినా డొక్క చించుతానని కొత్త ఆర్డర్ పాస్ చేసింది. ప్రజల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్న నీరూ యాదవ్ పరిచయం. జిల్లా అధికారులతో ఎప్పుడు మీటింగ్ జరిగినా నీరూ యాదవ్ లేచి గట్టిగా మాట్లాడుతుంది. అక్కడున్న వాళ్లు ఆమెను ‘మహిళ అయినా’ ఎంత గట్టిగా మాట్లాడుతోందని ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూస్తారు. ‘నేను మహిళనే. కాని బాగా చదువుకున్నాను. మీరు గోల్మాల్ చేసిన బిల్లుల మీద సంతకం పెట్టమంటే పెట్టను. అవినీతి చేయను. నా పంచాయితీలో జరగనివ్వను’ అని తిరగబడుతుంది. అంతే కాదు అది వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతుంది కూడా. రాజస్థాన్‌లోని ‘ఝుంజును’ జిల్లాలోని ‘లంబి అహిర్’ అనే పంచాయితీ ఈ నీరూ యాదవ్ అనే సర్పంచ్ వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. లంబి అహిర్ రాజస్థాన్‌లో ఉన్నా హర్యాణ సరిహద్దులో ఉంటుంది. ఆ ఊళ్లో యాదవులు ఎక్కువ. నీరూ యాదవ్ ఊళ్లోకెల్లా బాగా చదువుకోవడం వల్ల సర్పంచ్‌గా సులభంగా ఎంపికైంది. మరి... ఎం.ఎస్సీ, ఎం.ఇడి చేసి పిహెచ్.డి కూడా చేసిన నీరూ ఊరికి సేవ చేస్తానంటే ఎవరు వద్దంటారు? ► అమ్మాయిల ప్రగతే ముఖ్యం 2020లో సర్పంచ్ అయిన నాటి నుంచి నీరూ యాదవ్ ముఖ్యంగా అమ్మాయిల ప్రగతి గురించి దృష్టి పెట్టింది. తన పంచాయతీలోని స్త్రీల పట్ల ఉన్న కట్టుబాట్లను బాగ ఎరిగిన నీరూ వారు అన్ని విధాలుగా వికాసం చెందాలంటే విద్యతో పాటు ఇంటి నుంచి బయటకు కదలడం ముఖ్యమే అని ఊరికి చూపించదలుచుకుంది. అందుకే స్కూలు, కాలేజీ వయసున్న ఆడపిల్లల ఇంటింటికి వెళ్లి వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మహిళా హాకీ జట్టుగా జమ చేసింది. సర్పంచ్‌గా తనకొచ్చే జీతంతో ఒక కోచ్‌ను ఏర్పాటు చేసింది. పంచాయతీ నిధులతో గ్రౌండ్‌ను శుభ్రం చేసి ఏర్పాటు చేసింది. ‘మీరు ఉత్తమ హాకీ టీమ్‌గా విజయాలు సాధించాలి’ అనంటే ఆ ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేస్తూ, ఆటను ఆస్వాదిస్తూ ఇవాళ జిల్లా స్థాయిని దాటి స్టేట్ లెవల్లో ఆడేదాకా ఎదిగారు. ఇది ఊరందరికీ నచ్చి నీరూ యాదవ్ అసలు పేరు మరిచి ‘హాకీ వాలీ సర్పంచ్’ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆటలు మాత్రమే కాదు బాలికల చదువుకు, టెక్నికల్ విద్యకు కూడా నీరూ ప్రోత్సాహం అందిస్తోంది. కొంతమంది యువతులను షార్ట్‌టెర్మ్ టెక్నికల్ కోర్సులకు పంపి వారికి ఉద్యోగాలు దొరికేలా చూస్తోంది. తన సొంత డబ్బుతో చదివిస్తోంది. ► పెళ్ళిళ్ల వృధాకు విరుగుడు ఊళ్లో పెళ్లిళ్లు, మీటింగులు, ఇతర ఫంక్షన్ల వల్ల భోజనాల సమయంలో పేరుకు పోతున్న చెత్తను గమనించిన నీరూ యాదవ్ తాజాగా ‘చెత్త రహిత వివాహాలు’ అనే ప్రచారాన్ని మొదలెట్టింది. పెళ్లిళ్ల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్లు వాడి పారేయడం వల్ల పేరుకుపోతున్న చెత్తకు విరుగుడుగా స్టీలు పళ్లేలు, గ్లాసులు, బకెట్లు, వంట పాత్రలు కొని పంచాయితీ ఆఫీసులో పెట్టింది. ఊళ్లో ఏ ఫంక్షన్‌కైనా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే నీరూ యాదవ్ తయారు చేసిన మహిళా కార్యకర్తలు వచ్చి వడ్డిస్తారు. ఎంత తింటే అంత పెట్టడం వల్ల ఆహారం వృధా కాకుండా చూడాలనేది ఆలోచన. అంతేకాదు ఒకవేళ ఆహారం వృధా అయితే దానిని ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే కార్యాచరణ కూడా నీరూ మొదలెట్టింది. ‘మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే’ అంటుంది నీరూ. పిల్లల ఆట కోసం చేతిలో సరదగా హాకీ బ్యాట్ పట్టుకున్నా అది పట్టుకుని ఆమె చేస్తున్న సంస్కరణలు జనం వింటున్నారు. ► రైతుల కోసం నీరూ యాదవ్ పల్లెకు ఆయువుపటై్టన రైతును ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతులకు కావాలసిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ఏర్పాటు కోసం పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం కోసం ఊరి రైతులతో ఎఫ్.పి.ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసింది. దాంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. నీరూ యాదవ్‌ను మెచ్చుకుంటున్నారు. ‘హాకీ వాలీ సర్పంచ్’ నీరూ యాదవ్ రాబోయే రోజుల్లో సర్పంచ్ కంటే పై పదవికి వెళ్లకుండా ఉండదు. ఆమె చేయాలనుకున్న మంచి పనుల లిస్టులో ఇవి కొన్నే. అన్ని పనులు జరగాలంటే అలాంటి వాళ్లు ఇక్కడితో ఆగకపోవడమే కరెక్ట్. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే. -
కాపలాదారు కూడా దొంగతనం చేయవచ్చు: రాహుల్
ఝుంఝును(రాజస్థాన్):దేశానికి కాపలాదారు (చౌకీదార్)గా ఉంటానంటున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు సంధించారు. కొన్నిసార్లు కాపలాదారు కూడా దొంగతనానికి పాల్పడతాడని, అందుకే దేశం తాళం చెవులను కేవలం ఒకే ఒక్కరి చేతుల్లో పెట్టకూడదని అన్నారు. ఈ రోజు ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మోడీ తాను దేశానికి కాపలాదారు కావాలనుకుంటున్నారు. కోట్లాది ప్రజలు దేశానికి కాపలాదారులు కావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. దేశం తాళం చెవులను కోట్లాది ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం. అదే కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న పెద్ద తేడా అన్నారు. జనానికి ఒక్క చౌకీదార్ అక్కర్లేదు. ఇప్పటికే పెద్ద చౌకీదార్లు చాలా మంది ఉన్నారు. వారిని తప్పించాల్సిన అవసరముందని అన్నారు. అందుకే తాము ఉపాధి హామీ, సమాచార హక్కు చట్టాలతో సాధికారత కల్పించామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను బిజెపి కాపికొట్టిందని విమర్శించారు. రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలట్ కూడా సభలో పాల్గొన్నారు.