బేతుపల్లి చెరువు వద్ద వరద ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి, పక్కన ఎమ్మెల్యే రాగమయి తదితరులు
సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలన
సత్తుపల్లి: మురసు తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు గల్లంతైన బేతుపల్లి చెరువుతోపాటు సత్తుపల్లి, భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి గురువారం ఉదయం పరిశీలించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు దివాకర, అంకిత్, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు రాగమయి, జారె ఆదినారాయణతో కలిసి పర్యటించిన మంత్రి.. వరద తీవ్రత, పంటలకు జరిగిన నష్టంపై రైతులను అడిగి తెలుసుకొని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
దమ్మపేట మండలం నాగుపల్లి వద్ద మల్లెపూల వాగు ఉప్పొంగడంతో దెబ్బతిన్న పంటలు, ముసలి బంధం చెరువు కట్టకు ఐదు చోట్ల గండ్లు పడిన ప్రాంతం, గండుగులపల్లి వద్ద వాగు పరిసరాల్లో దెబ్బతిన్న కట్ట, దమ్మపేటలో తెగిపోయిన పేరంటాల చెరువు కట్టను పరిశీలించి సహాయక చర్యలు, మరమ్మతులపై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత సత్తుపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రాంతంలోకి వరద నీరు చేరిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దెబ్బతిన్న చెరువు కట్టలకు తక్షణమే మరమ్మతులు చేపడతామని, పంట నష్టంపై వివరాలు సేకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సీఎం స్వయంగా సమీక్ష: బేతుపల్లి చెరువు వరదలో మత్స్యకారులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గల్లంతుపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పలుమార్లు వివరాలు తెలుసుకొని సూచనలు చేశారని మంత్రి పొంగులేటి అన్నారు. బేతుపల్లి చెరువు అలుగును పరిశీలించాక సింగరేణి గెస్ట్‌హౌస్‌లో అధికారులతో సమీక్షించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టం జరగకుండా చేయడం అభినందనీయమన్నారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని అభినందించారు. సీఎం ముందుచూపుతో పోలీసు శాఖ నుంచి 1,200 మంది, అగి్నమాపక శాఖ నుంచి 700 మందిని ఎంపిక చేసి ఎస్‌డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేయడం వల్ల సహాయక చర్యలు సత్వరం అందాయని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, మువ్వా విజయ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


