నీటి పాలైన పంట | Crop damage in Telangana due to Cyclone Murasu | Sakshi
Sakshi News home page

నీటి పాలైన పంట

Nov 6 2026 5:53 AM | Updated on Nov 6 2026 5:53 AM

Crop damage in Telangana due to Cyclone Murasu

భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘మురసు’దాడి 

23 వేలకు పైగా ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి తదితర పంటలకు నష్టం 

ప్రాజెక్టులకు గండ్లు, దెబ్బతిన్న రహదారులు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను ‘మురసు’తుపాను అతలాకుతలం చేసింది. చేతికి వచ్చే దశలోని పంటలన్నీ నీటి పాలయ్యాయి. పొలాలు నీటి కుంటల్లా మారాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్ష ప్రభావం పంటలపై పడింది. వరి చేలు నేలవాలగా.. వరి, పత్తి, మిర్చి చేలల్లోనూ నీరు వచ్చి చేరింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 23,140 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో సర్వే చేపడితే నష్ట తీవ్రత మరింత పెరగనుంది. 

అర్నబ్‌ తుపానుతో ఖమ్మం జిల్లాలో వర్షాలు అంతగా కురవలేదు. ఆ తర్వాత ‘మురసు’తో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి ముసురు ప్రారంభమై బుధవారం కూడా కొనసాగింది. ఈ వర్షం వల్ల సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. అశ్వారావుపేటలో 27.7 సెం.మీ., పెనుబల్లిలో 22 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరుల్లో 21 సెం.మీ. మేర నమోదైంది. దమ్మపేట, తల్లాడ, వేంసూరు మండలాల్లోనూ భారీ వర్షమే కురిసింది. వర్షం కారణంగా ఇప్పటివరకు వట్టిపోయిన ప్రాజెక్టుల్లోకి నీరు చేరినా, వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలుచోట్ల ప్రాజెక్టులకు గండ్లు పడి వరద వృథాగా పోతోంది.

‘మురసు’ముంచింది..
ఖమ్మం జిల్లాలో ఈ వానాకాలంలో సీజన్‌లో 5.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా..వరి 2,92,915 ఎకరాల్లో, పత్తి 2,16,229 ఎకరాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందుల నడుమ సాగు చేయగా, కొద్దిమేర దిగుబడులు ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్నాయి. వరి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో చివరి తడులు అవసరం ఉన్నాయి. చివరి తడులు అవసరం ఉన్న ప్రాంతాల్లో తాజా వర్షాలు రైతులకు లాభం చేకూరగా.. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

వరి నీట మునగడంతో ధాన్యం రంగు మారడం, మొలకలు రావడం వంటివి జరుగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి తీత దశలో ఉండి.. ధర పలుకుతున్న సమయంలో తుపాను తుడిచిపెట్టింది. పత్తి కాయలు తడిసిపోవడంతోపాటు తేమశాతం పెరగడంతో నాణ్యత దెబ్బతిన్నది. మిరప చేలలో నీరు నిల్వ ఉండటంతో వేరు కుళ్లి పోయి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement