ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే | TGEJAC to announce action plan after Deepavali: Telangana | Sakshi
Sakshi News home page

ఫిట్‌మెంట్‌ ఇవ్వాల్సిందే

Nov 7 2026 4:31 AM | Updated on Nov 7 2026 4:31 AM

TGEJAC to announce action plan after Deepavali: Telangana

మీడియాతో మాట్లాడుతున్న మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు

దీపావళిలోగా ప్రభుత్వం పీఆర్సీ నివేదిక తెప్పించుకోవాలి..

తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్‌

సీఎం, సీఎస్‌లు ఆదేశించి రెండు నెలలు గడుస్తున్నా కమిషన్‌ నివేదిక ఇవ్వలేదు 

పీఆర్సీ ఏర్పాటు చేసి మూడేళ్లు గడిచిపోయాయి.. దాని కాల పరిమితి కూడా ముగిసింది 

నివేదిక సమర్పణలో జాప్యానికి కారణాలేమిటో అర్థం కావడం లేదు 

కమిషన్‌ తీరుతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్న నేతలు మారం, ఏలూరి 

పెండింగ్‌ బిల్లుల చెల్లింపులపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు 

దీపావళి తర్వాత మరోసారి భేటీ.. ప్రత్యేక కార్యాచరణకు రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: పీఆర్సీ నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా కమిషన్‌ ఇప్పటికి నివేదిక ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. సెప్టెంబర్ నెలాఖరులో జరిగిన చర్చల సందర్భంగా పీఆర్సీ నివేదిక కోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని, దీంతో సీఎస్‌ లిఖితపూర్వకంగా లేఖ రాసినప్పటికీ కమిషన్‌ ఇప్పటివరకు స్పందించలేదు, నివేదిక ఇవ్వలేదని పేర్కొన్నారు. 

నివేదిక సమర్పణలో జాప్యానికి కారణాలేమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం దీపావళి లోపు నివేదిక తెప్పించుకుని పరిశీలించి ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం టీజీఓ భవన్‌లో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీశ్వర్, శ్రీనివాసరావు మాట్లాడారు.  

2023 జూలై నుంచే రెండో పీఆర్సీ ఇవ్వాలి 
‘2023 జూలై 1వ తేదీ నుంచి ఉద్యోగులకు రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా, అక్టోబర్‌లో రెండో పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయాయి. కమిషన్‌ కాల పరిమితి సైతం ముగిసిపోయింది. కమిషన్‌ గడువు పొడిగింపు ఉత్తర్వులు కూడా రాలేదు. ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెండింగ్‌ డీఏల్లో సీఎం రేవంత్‌రెడ్డి రెండు డీఏలు ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందాం. కానీ రెండు నెలలవుతున్నా పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు.

మరోవైపు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు రూ.1,000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు పెంచాలని కోరితే సీఎం సానుకూలంగా స్పందించినా..ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఇస్తున్న నిధులను ఏయే కేటగిరీలకు ఇస్తున్నారో తెలియజేయాలి. కేవలం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న వారికి ఇస్తే జేఏసీకి విలువ ఏం ఉంటుంది? జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినా ఇప్పటికీ జరగలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించాలి. అదేవిధంగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగిన అన్ని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వెంటనే గుర్తింపును పునరుద్ధరించాలి. 

సీసీఎస్‌ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలి 
    కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) అధ్యయనానికి కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ కమిటీలో జేఏసీ నుంచి లేదా జేఎస్‌సీ నుంచి కూడా అవకాశం కల్పించాలి. ఉద్యోగుల హాజరు, ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలుపై సమీక్షలు నిర్వహిస్తున్న అధికారులు.. పెండింగ్‌ బిల్లులపై మాత్రం కనీసం సమీక్షించరు.. స్పందించరు. జీఓ 317 ద్వారా స్థానిక అంశం సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదు. హెచ్‌ఓడీ కార్యాలయాల నుంచి సెక్రటేరియట్‌ సర్వీసుల్లోకి 12.5 శాతం కోటాను అమలు చేయాలి. హెచ్‌ఓడీ కార్యాలయాల ఉద్యోగులను సెక్రటేరియట్‌లోకి తీసుకునేందుకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పునరుద్ధరించాలి. 

ఉన్నతాధికారులపై సీఎంకు ఫిర్యాదు చేస్తాం 
    కొన్ని ప్రభుత్వ శాఖల్లోని  అధికారుల వైఖరి వల్లే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. అలాంటి వారిపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. వారంలో ఐదురోజుల పనిదినాల అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. దీనివల్ల ఉద్యోగుల సేవలను ఎక్కువ సమయం ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వానికి  పలు రకాల ఖర్చులు తగ్గుతాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపైనా ప్రభుత్వం సమీక్షించాలి. ఇందులోని లోపాలను వేగవంతంగా పరిష్కరించాలి.  

కార్యాచరణ వాయిదా ఇకపై ఉండదు.. 
దీపావళి తర్వాత మరోసారి జేఏసీ ప్రత్యేక సమావేశం నిర్వహించుకుని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తాం. సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఎన్నోసార్లు కార్యాచరణ ప్రకటించి వాయిదాలు వేశాం. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. జేఏసీ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వివిధ ఆర్థికేతర సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి..’ అని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. 

హైలైట్‌ చేయడం కోసం.. 
2023 జూలై నుంచే రెండో పీఆర్సీ ఇవ్వాలి.. పెండింగ్‌ డీఏల్లో సీఎం రేవంత్‌రెడ్డి రెండు డీఏలు ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందాం. కానీ రెండు నెలలవుతున్నా పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. మరోవైపు పెండింగ్‌ బిల్లుల చెల్లింపులు రూ.1,000 కోట్ల నుంచి రూ.2 వేల కోట్లకు పెంచాలని కోరితే సీఎం సానుకూలంగా స్పందించినా..ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

సీసీఎస్‌ అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలి..
    కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) అధ్యయనానికి కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ కమిటీలో జేఏసీ నుంచి లేదా జేఎస్‌సీ నుంచి కూడా అవకాశం కల్పించాలి. 

ఉన్నతాధికారులపై సీఎంకు ఫిర్యాదు చేస్తాం 
    కొన్ని ప్రభుత్వ శాఖల్లోని  అధికారుల వైఖరి వల్లే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. వారి వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. అలాంటి వారిపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement