కన్న తల్లిదండ్రులు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులతో చిన్నారి
కలెక్టర్, డీడబ్ల్యూవోలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫోన్
డీడబ్ల్యూవో భాస్కర్ తీరుపై తీవ్ర ఆగ్రహం
ఆగమేఘాల మీద బాబు దత్తత పూర్తిచేసిన అధికారులు
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ దంపతులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చిన్నారి రుద్ర మానేశ్ కథ సుఖాంతమైంది. చిన్నారి వ్యథపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. కలెక్టర్ సత్యప్రసాద్, డీడబ్ల్యూవో భాస్కర్‌లకు ఫోన్ చేశారు. ముఖ్యంగా డీడబ్ల్యూవో భాస్కర్‌పై మంత్రి తీవ్రంగా మండిపడ్డట్లు తెలిసింది. దీంతో విడదీసిన అధికారులే దత్తత కార్యక్రమాన్ని దగ్గరుండి పూర్తి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీడబ్ల్యూవో భాస్కర్ హిందూ దత్తత చట్టం 1956 ప్రకారం దత్తత కార్యక్రమాన్ని చేపట్టారు.
పిల్లాడి అసలు తల్లిదండ్రులు లక్ష్మణ్–సుమలతలను పిలిపించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెంపుడు తల్లిదండ్రులు శ్రీనివాస్‌గౌడ్–సరిత దంపతులకు అధికారికంగా రుద్ర మానేశ్ దత్తత ప్రక్రియను నిర్వహించారు. దీంతో సమస్య పరిష్కారమయ్యింది. హైకోర్టులో కేసులు ఉపసంహరించుకుంటామని కలెక్టర్ చెప్పారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో డీడబ్ల్యూవో భాస్కర్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
బాబు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించి కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించారని శ్రీనివాస్ అడ్వొకేట్ రఘునందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. పిల్లాడు లక్ష్మణ్ దంపతులకే జని్మంచాడన్న ఆధారాలు ఉన్నా.. కన్నవారిపై, పెంచిన వారిపై పోలీసు కేసు పెట్టించడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేయడం ఆయన అత్యుత్సాహానికి నిదర్శనమని అన్నారు.
అధికారుల తీరు సరిగా లేదు
‘సాక్షి’లో కథనం చదివాక వెంటనే డీడబ్ల్యూవో, కలెక్టర్‌తో మాట్లాడా. బాలుడిపై హైకోర్టులో కేసులు వేయడం, పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టడం ఏంటని అడిగా. వాటిని వెంటనే ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించా. ఇలాంటి చర్యలతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందంటూ డీడబ్ల్యూవోను మందలించా. – మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కేసులు వెనక్కి తీసుకుంటాం
రుద్ర మానేశ్ విషయంలో హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ను ఉపసంహరించుకుంటాం. జగిత్యాల పీఎస్‌లో బాబును కన్నవారు, దత్తత తీసుకున్న వారిపై నమోదైన క్రిమినల్ కేసును కూడా వెనక్కి తీసుకుంటాం. ఈ మేరకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభించాం. – సత్యప్రసాద్, కలెక్టర్
‘సాక్షి’కి కృతజ్ఞతలు
మా బాబు కోసం మేం ఎంతో పోరాడాం. హైకోర్టు దాకా వెళ్లాం. ఈ పోరాటంలో ‘సాక్షి’దినపత్రిక అండగా నిలిచింది. విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంలో సాక్షి చొరవ మరువలేనిది. ఎట్టకేలకు బాబు మా ఇంటికి వచ్చాడు. ‘సాక్షి’కి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – శ్రీనివాస్–సరిత దంపతులు


