తొమ్మిదేళ్లుగా భర్తీకి నోచుకోని బ్యాక్‌లాగ్ పోస్టులు
జిల్లాలో ఖాళీలపై పొంతన లేని లెక్కలు
శాఖలవారీగా వివరాల సేకరణలో జాప్యం
ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న సంక్షేమాధికారులు
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలోని దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ వెంటవెంట నే జరుగుతుండగా.. ఇక్కడ మాత్రం ఏళ్లు గడుస్తున్నాయి. పోస్టుల భర్తీ ఆన్‌లైన్ ద్వారానే చేపట్టాలని గత ప్రభుత్వం సూచించడంతో ఆన్‌లైన్ ప్రక్రియతోనే ఏళ్లుగా సాగదీశారు. తాజాగా మా న్యువల్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ప్రసుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మాన్యువల్‌గా నియామకాలు జరిపితే తమకు సమస్యలు వసాయని అధికారులు భయపడుతున్నారు. తొమ్మిదేళ్లుగా భర్తీ చేయకపోవడంతో పట్టభద్రులైన వికలాంగ అభ్యర్థులు తమకు వైకల్యమా లేదా ప్రభుత్వానికి వైకల్యమా అంటూ నిట్టూరుస్తున్నారు.
కరీంనగర్‌టౌన్: దివ్యాంగులకు వీల్‌చైర్లు, కాలిపర్సులు, ఇతరత్రా ఉపకరణాల పంపిణీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పుడు బ్యాక్‌లాగ్ పోస్టులకు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పుడు దివ్యాంగుల విషయంలో ఎందుకు చేయొద్దనే వాదన వినిపిస్తోంది. పైగా దివ్యాంగులకు సంబంధించిన జీవోలు చాలా సంక్షిష్టంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని అమలు చేయడం కష్టంగా ఉంటుంది. వికలాంగుల శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడంతో.. ఈ శాఖ అధికారులకు ఆ జీవోలు కొత్త కావడంతో వాటిని అర్థం చేసుకొని ఆచరణలోకి తీసుకురావడానికి సమయం పడుతోంది. ఆన్‌లైన్ ద్వారా పోస్టుల భర్తీకి సాఫ్ట్‌వేర్ సమకూర్చాల్సిందిగా ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల దివ్యాంగుల సంక్షేమ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఇందుకు సానుకూలంగా స్పందించింది. సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి తీసుకొస్తామని తొమ్మిదేళ్లవుతున్నా ఆ ఊసే లేదు.
పోస్టులపై అస్పష్టం
ఆయా ప్రభుత్వ విభాగాల్లో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులెన్ని ఉన్నాయనే విషయంలో స్పష్టత రావడం లేదు. ఆయా విభాగాలు పంపిన ఖాళీల వివరాలకు.. వాస్తవంగా ఉన్న ఖాళీలకు పొంతన ఉండడం లేదు. ఒక శాఖలో రెండు పోస్టులున్నట్టు చూపించినా.. తీరా పరిశీలిస్తే ఒకటే ఉంటోంది. మరికొన్నిచోట్ల వాస్తవంగా చూపిన వాటికన్నా ఎక్కువ ఖాళీలున్నాయి.
ఎవరైనా 3 నెలలే..
దివ్యాంగుల శాఖలో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ కాకపోవడానికి ఈ శాఖలో సంక్షేమాధికారులకు తరచూ బదిలీలు కావడం, ఉద్యోగ విరమణ చేయడం, సిబ్బంది కొరత కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారులు పట్టుమని నాలుగైదు నెలలు కూడా ఉండటం లేదు. అంతలోనే బదిలీ, దివ్యాంగుల సంక్షేమ శాఖను మహిళా, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయడం కూడా మరో కారణం.
ఖాళీలపై అయోమయం
జిల్లాలో మొదట దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టులెన్ని ఉన్నాయనే వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఇంకా 20 వివిధ శాఖల నుంచి వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు రావాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 40 వరకు బ్యాక్‌లాగ్ పోస్టులున్నట్లు వికలాంగ పట్టభద్రులు వెల్లడిస్తున్నారు. గతంలో కూడా 66 బ్యాక్‌లాగ్ పోస్టులున్నట్టు వివరాలందాయి. తీరా పరిశీలించిన తర్వాత అవి 41కు తగ్గిపోయాయి. గతంలో కూడా అంటే 2017లో బ్యాక్‌లాగ్ పోస్టులు 16 పోస్టులను చూపకుండా దొడ్డిదారిన నియామకాలకు తెర లేపారని ఆరోపిస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పంపిన వివరాల ప్రాతిపదికన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీని చేపడితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు భావించి నియామక ప్రక్రియ చేపట్టడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు వస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీలను సైతం భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు.
దివ్యాంగుల శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. తొమ్మిదేళ్లుగా నియామకాలు చేపట్టకుండా ప్రభుత్వం వ్యవహరి స్తున్న తీరు బాధాకరం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వెనకభాగం దివ్యాంగుల భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయాలి. – మొగిలి లక్ష్మయ్య,
దివ్యాంగుల పట్టభద్రుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు
20 ఏళ్లుగా కార్ఖనాగడ్డలోని హాస్టల్ ఉంటున్న. ఎంకామ్, బీఈడీ పూర్తయింది. తల్లి లేదు. తండ్రి వృద్ధుడు. పోటీ పరీక్షలు రాస్తున్న. తక్కవ పోస్టులుండటంతో ఉద్యోగం రావడం లేదు. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగమిచ్చి ఆదుకోవాలి. – జక్కుల రాజు
15 సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలోని వృద్ధులు, వికలాంగుల వసతి గృహంలో ఉంటున్న. ఎలాంటి ఆధారం లేదు. ప్రభుత్వం వికలాంగులపై వివక్ష వీడి బ్యాక్‌లాక్ పోస్టులను భర్తీ చేయాలి. లేదా ప్రయివేట్ ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
– కె.పరశురాం, ఎంబీఏ


