పనుల్లో పారదర్శకతకే సామాజిక తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పనుల్లో పారదర్శకతకే సామాజిక తనిఖీలు

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

● డీఆర్డీవో మచ్చ గీత

● డీఆర్డీవో మచ్చ గీత

హుజూరాబాద్‌ రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపాధిహామీ పథకం పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పూర్తి పారదర్శకత కోసమే సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మచ్చ గీత తెలిపారు. శుక్రవారం హుజూరాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో 17వ విడత ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని 20 గ్రామాలకు సంబంధించి 01.04.2025 నుంచి 31.03.2026 వరకు ఏడాది కాలంలో ఉపాధిహామీ కింద(వీబీజీ రామ్‌జీ) చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి ఆ నివేదికలను ప్రజావేదికలో సమర్పించాయి. ఈ సందర్భంగా తనిఖీ బందాలు అభ్యంతరం వ్యక్తం చేసిన పనులపై డీఆర్డీవో సమగ్రంగా విచారణ జరిపి.. కొన్ని గ్రామాల్లో నిధుల రికవరీకి ఆదేశించారు. ఎంపీడీవో సునీత, సర్పంచులు, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, సామాజిక తనిఖీ బృందం సభ్యులు పాల్గొన్నారు.

బాణాసంచా దుకాణాల వద్ద భద్రతా చర్యలు

కరీంనగర్‌క్రైౖం: దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని బాణాసంచా విక్రయాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా తాత్కాలిక బాణా సంచా విక్రయ దుకాణాలకు మొత్తం 223 లైసెన్సులు మంజూరు చేయగా.. జిల్లాలో ఇప్పటికే 8 హోల్‌సేల్‌ దుకాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు శుక్రవారం అల్గునూరు, కొత్తపల్లి, ముగ్ధుంపూర్‌ ప్రాంతాల్లోని హోల్‌సేల్‌ బాణాసంచా దుకాణాలను తనిఖీ చేశారు. కరీంనగర్‌ నగరంలో తాత్కాలిక బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు గుర్తించిన బహిరంగ ప్రదేశాలను పరిశీలించారు. దుకాణాల యజమానులకు అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారులు, వ్యాపారుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు సూచించారు.

జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరణ

కరీంనగర్‌క్రైౖం: జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా ఎ.వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన జె.విజయ్‌ దేని చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు బదిలీ అయ్యారు. చర్లపల్లి సెంట్రల్‌ జైలులో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.వెంకటేశం.. జిల్లా జైలు నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా సబ్‌ జైల్స్‌ అధికారిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న జె.విజయ్‌కు జిల్లా జైలు అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన సేవలను కొనియాడారు.

పత్తి మార్కెట్‌కు 3 రోజుల సెలవు

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు శని, ఆదివారాలు సాధారణ, సోమవారం అమవాస్య కారణంగా సెలవులుంటాయని, మంగళవారం యధావిధిగా యూర్డులో క్రయవిక్రయాలు ప్రారంభమౌతాయని చైర్‌పర్సన్‌ పూల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌కు 132 వాహనాల్లో 1,210 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకొచ్చారు. క్వింటాల్‌ పత్తి ధర గరిష్టంగా రూ.8,770, మోడల్‌ ధర రూ.8,550, కనిష్ట ధర రూ.8,300కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేయగా.. గ్రేడ్‌–2 కార్యదర్శి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement