బస్టాండ్ ఆవరణలో అంధకారంలో ప్లాట్‌ఫాంలు
డిపో–1 ముందు చీకటి
ఔట్ గేటులో చీకట్లోనే బయటకు
వస్తున్న ప్రయాణికులు
ఉత్తర తెలంగాణకే తలమానికంగా ఉన్న కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. వేలాది మంది నిత్యం రాకపోకలు సాగించే బస్టాండ్‌లో రాత్రివేళల్లో చీకటి రాజ్యమేలుతుండగా.. భద్రతా ఏర్పాట్లు నామమాత్రంగా మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బస్టాండ్ ఔట్ గేట్ పరిసరాల్లో కనీసం వీధి దీపాలు కూడా వెలగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్ ఇన్‌గేట్ సమీపంలో హత్య జరగగా.. బస్టాండ్ పరిసరాల్లో నెలకొన్న భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బస్టాండ్ ఔట్ గేట్ నుంచి బయటకు వెళ్లే మార్గంలో ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు, వెలగని వీధి దీపాలతో రాత్రి నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. బస్టాండ్ ప్రధాన ద్వారం, ఆటో స్టాండ్ వద్ద, వన్ డిపో ఎదుట, బస్సులు నిలిపే ప్రదేశాల్లోనూ సరైన వెలుతురు లేదు. ప్లాట్‌ఫారాల వద్ద చీకటి అలుముకుంటోంది. పోలీస్ ఔట్ పోస్ట్‌లో సిబ్బంది విధుల నిర్వహణపై ప్రయాణికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బస్టాండ్‌లోని 41 సీసీ కెమెరాల్లో కేవలం 30 మాత్రమే పని చేస్తున్నాయి. పగలు బస్టాండ్‌లో నలుగురు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. రాత్రి మాత్రం ఇద్దరే ఉంటున్నట్లు సమాచారం. బస్టాండ్ ఔట్ గేట్ నుంచి ఆటోస్టాండ్ వరకు హైమాస్ట్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – కరీంనగర్
సిబ్బంది లేక ఖాళీగా ఉన్న పోలీస్ ఔట్ పోస్టు
ఆటోస్టాండ్, సిబ్బంది వాహనాల వద్ద చిమ్మచీకటి
ఔట్ గేటు వద్ద ఖాళీగా ఉన్న సెక్యూరిటీ కుర్చి


