డివిజన్‌ బాట.. మేయర్‌ మాట | - | Sakshi
Sakshi News home page

డివిజన్‌ బాట.. మేయర్‌ మాట

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

సరికొత్త కార్యక్రమానికి మేయర్‌ శ్రీనివాస్‌ శ్రీకారం

ప్రతీ పది రోజులకో డివిజన్‌ బాట

మొదటిరోజు 9వ డివిజన్‌లో పర్యటన

ఏడాది లోగా డంప్‌యార్డ్‌ ప్రక్షాళన: మేయర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ డివిజన్‌ బాట.. మేయర్‌ మాట అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని 66 డివిజన్లలో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు స్వయంగా తెలుసుకొనేందుకు, ప్రాధాన్య క్రమంలో వాటిని పరిష్కరించేందుకు అధికారులతో కలిసి ఆయన ఒక్కో డివిజన్‌లో పర్యటించనున్నారు. ప్రతీ పది రోజులకు ఒక డివిజన్‌ చొప్పున 66 డివిజన్లలో పర్యటించేందుకు ఆయన ప్రణాళికలు రూపొందించుకున్నారు. శుక్రవారం మొదటి రోజు నగరంలోని 9వ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్‌ పరిధిలోని కోతిరాంపూర్‌, అలకాపురికాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, నగరపాలక సంస్థ అధికారులు తదితరులతో కలిసి కాలనీల వాసులతో మాట్లాడారు. స్థానికంగా ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిశీలించారు. పలు కాలనీల్లో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ శిథిలావస్థకు చేరి రోడ్డుపై పారుతున్న మురుగు కాలువలను తనిఖీ చేశారు.

ఏడాది లోగా ప్రక్షాళన

డంప్‌యార్డ్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మేయర్‌ తెలి పారు. 9వ డివిజన్‌లో పర్యటన సందర్భంగా మా ట్లాడారు. బండి సంజయ్‌ సూచనలతో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు డివిజన్‌ బాట కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. డివిజన్‌కు ప్రధాన సమస్యయిన డంప్‌యార్డ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా ఉన్న డంప్‌యార్డ్‌ సమస్య రాత్రికి రాత్రి పోయేది కాదని, ప్రజలు సంయమనం పాటించాలన్నారు. ఏడాది కాలంలో డంప్‌యార్డ్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు. డిప్యూటీ కమిషనర్‌ వేణుమాధవ్‌, డీఈ దేవేందర్‌రెడ్డి, ఏఈ భీంవర్ధన్‌రెడ్డి, పర్యావరణ ఇంజనీర్‌ స్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement