టెండర్లపై 48 దేశాలకు చెందిన దిగ్గజాల ఆసక్తి
రూ.7,345 కోట్లతో తొలి దశ పనులకు గ్లోబల్ టెండర్లు
ప్రీ–బిడ్ సమావేశంలో 30కు పైగా దిగ్గజ సంస్థల సందడి
తక్కువ ధరకే కాదు.. నాణ్యతకూ ‘మార్కుల’ పద్ధతిలో ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర రూపురేఖ లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిబంధనల ప్రకారం సుమారు రూ.7,345.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న తొలి దశ పనులకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఆహ్వనించిన అంతర్జాతీయ టెండర్లకు అనూహ్య స్పందన లభించింది.
ఇటీవల జరిగిన ప్రీ–బిడ్ సమావేశంలో ఆన్‌లైన్ ద్వారా 15 సంస్థలు, ఆఫ్‌లైన్ ద్వారా మరో 15 సంస్థలు పాల్గొని ప్రాజెక్టు వివరాలపై ఆరా తీశాయి. భారత్‌కు చెందిన దిగ్గజ మౌలిక సదుపాయాల సంస్థలు ఎల్‌అండ్‌టీ, ఏఎంఆర్ గ్రూప్, మెఘా వంటి సంస్థలతో పాటు చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, మలేషియా సహా మొత్తం 48 దేశాలకు చెందిన అంతర్జాతీయ ఏజెన్సీలు, నిర్మాణ రంగ దిగ్గజాలు ఈ టెండర్లపై ఆసక్తి కనబరిచాయి. ఏడీబీ సభ్య దేశాలకు చెందిన అర్హతగల సంస్థలన్నింటికీ పోటీ పడే అవకాశం ఉండడంతో మూసీ పనుల కోసం గ్లోబల్ స్థాయి పోటీ నెలకొంది. బిడ్ల దాఖలుకు ఈనెల 26 తుది గడువు కావడంతో అంతర్జాతీయ దిగ్గజాల పోటీలో మూసీ ప్రాజెక్ట్ ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
రెండు ప్యాకేజీలుగా విభజన..
భూసేకరణ వ్యయాన్ని మినహాయించి రూ.7,345.12 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూ.4,500 కోట్లు ఏడీబీ రుణంగా సమకూరనుండగా, మిగిలిన రూ.2,845.12 కోట్లను హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా సమీకరించనున్నారు. మొత్తం 19.05 కిలోమీటర్ల తొలి దశ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. జోన్–1బీ పరిధిలో నార్సింగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై అత్యాధునిక ఐకానిక్ కేబుల్ స్టేడ్ స్టీల్ బ్రిడ్జి, జోన్–1ఏలో రాజేంద్రనగర్ టోల్ ప్లాజా సమీపంలో మరో ఐకానిక్ వంతెన నిర్మించనున్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో సమగ్ర నదీ ప్రక్షాళన, వరద నివారణ కట్టలు, రిటైనింగ్ వాల్స్, నదీ తీర రహదారులు, మురుగునీరు నది లో కలవకుండా భారీ ట్రంక్ సీవర్ మెయి న్స్, అండర్‌గ్రౌండ్ యుటిలిటీ కారిడార్, రబ్బర్ డ్యామ్‌ల నిర్మాణం చేపడతారు.
‘మార్కుల’పద్ధతిలో కాంట్రాక్టర్ల ఎంపిక..
పాత విధానంలో కేవలం తక్కువ ధర (ఎల్1) కోట్ చేసిన సంస్థకే పనులు అప్పగించే పద్ధతికి స్వస్తి పలికారు. ఏడీబీ మార్గదర్శకాల ప్రకారం మెరిట్ పాయింట్ క్రైటీరియా (ఎంపీసీ) అమలు చేస్తున్నారు. ఇందులో సంస్థల సాంకేతిక సామర్థ్యం, పనితీరు నాణ్యతకు 50 శాతం, ఆర్థిక బిడ్‌కు 50 శాతం వెయిటేజీ ఇచ్చి, ఉమ్మడి మార్కులు ఎక్కువగా సాధించిన సంస్థకే కాంట్రాక్టు అప్పగిస్తారు. ఎంపికైన సంస్థలు 24 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు, తదుపరి 5 ఏళ్ల పాటు నిర్వహణ (ఓఅండ్‌ఎం) బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది.


