మంత్రి దామోదర, ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావుల ఎపిసోడ్‌పై హైకమాండ్‌కు నివేదిక
ఢిల్లీలో జరిగిన విషయాలు, పీసీసీ చీఫ్ పిలుపు బేఖాతరు అంశాలు ఏఐసీసీ దృష్టికి
గాందీభవన్‌కు వస్తానని మంత్రి చెప్పిన తర్వాతే మహేశ్‌గౌడ్ నుంచి పిలుపు
భేటీకి లక్ష్మీకాంతరావు సైతం డుమ్మా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే టి. లక్ష్మీకాంతరావుల వ్యవహారం ఏఐసీసీ కోర్టులోకి వెళ్లింది. ఢిల్లీ వేదికగా ఈ ఇద్దరి మధ్య జరిగిన వివాదం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై టీపీసీసీ నుంచి పార్టీ హైకమాండ్‌కు నివేదిక వెళ్లినట్టు గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఆ ఘటన జరగడానికి వెనుక ఉన్న కారణాలేంటి? ఆ ఇద్దరి మధ్య మాటలు శ్రుతి మించేందుకు దారితీసిన పరిస్థితులేంటి? తదితర అంశాలపై మాట్లాడేందుకు గురువారం గాంధీభవన్‌కు రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలిచిన సందర్భంగా మంత్రి దామోదర వ్యవహరించిన తీరును కూడా ఈ నివేదికలో పొందుపర్చినట్టు సమాచారం.
తొలుత వస్తానని.. తర్వాత రావడం లేదని..
గాం«దీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన దామోదర, లక్ష్మీకాంతరావుల వివాదం గురించి ఏఐసీసీకి సమాచారం తెలియడంతో ఏం జరిగిందో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని హైకమాండ్ నుంచి పీసీసీకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలతో మాట్లాడి విషయం తెలుసుకునేందుకు గాం«దీభవన్‌కు రావాలని పీసీసీ చీఫ్ కబురు పంపారు. అయితే ఆయన ఆ కబురు పంపడానికి ముందే మంత్రి దామోదరతో గాంధీభవన్ వర్గాలు సంప్రదింపులు జరిపాయి.
పార్టీ సీనియర్ నేత కావడంతో పాటు రాష్ట్ర కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న ఆయనతో మాట్లాడి, పీసీసీ చీఫ్‌తో మాట్లాడడానికి లేదంటే గాంధీభవన్‌కు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అంగీకారం తెలిపిన తర్వాతే షెడ్యూల్ ఖరారు చేశారు. ఇదే విషయాన్ని గాం«దీభవన్ నుంచి మీడియాకు తెలియజేశారు. కానీ తొలుత వస్తానని చెప్పిన మంత్రి రాజనర్సింహ తీరా సమయానికి తాను రాలేనని, ఆరోగ్యం బాగాలేదని, కేబినెట్‌కు వెళ్లాల్సి ఉందని గాంధీభవన్‌కు సమాచారమిచ్చినట్టు తెలిసింది. మరోవైపు లక్ష్మీకాంతరావు కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం జరిగింది, ఇద్దరు నేతలూ సమావేశానికి పిలిచినా రాకపోవడం, ఇతర వివరాలతో హైకమాండ్‌కు మహేశ్‌గౌడ్ నివేదిక పంపినట్లు గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి.


