కరువుపై కాకుండా గ్లోబల్‌ సమ్మిట్‌పై చర్చా?! | Harish Rao Slams Revanth Reddy Over Drought and Farmers | Sakshi
Sakshi News home page

కరువుపై కాకుండా గ్లోబల్‌ సమ్మిట్‌పై చర్చా?!

Nov 7 2026 5:34 AM | Updated on Nov 7 2026 5:34 AM

Harish Rao Slams Revanth Reddy Over Drought and Farmers

రోదిస్తున్న రైతును ఓదార్చుతున్న హరీశ్‌రావు, సునీత

రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు నిధుల్లేవంటున్నారు.. 

గ్లోబల్‌ సమ్మిట్‌కు, ఫ్యూచర్‌ సిటీకి నిధులు ఎలా వస్తున్నాయి? 

బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు ఫైర్‌

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎండి పోయిన పంటల పరిశీలన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు ఎండి పోయి రైతులు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో రైతులను ఆదుకునే ఒక్క అంశాన్ని కూడా చర్చించకుండా గ్లోబల్‌ సమ్మిట్‌పై చర్చించడం ఏంటని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో తక్షణ కరువ సహాయంగా ఒక్కో రైతుకు ఆయా ప్రభుత్వాలు రూ.5 వేలు చొప్పున చెల్లించాయని చెప్పారు. కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు నిధులు లేవంటోందని ధ్వజమెత్తారు. 

అలాంటప్పుడు గ్లోబల్‌ సమ్మిట్‌కు, ఫ్యూచర్‌ సిటీకి, మూసీ సుందరీకరణకు నిధులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. శుక్రవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఎండి పోయిన పంటలను హరీశ్‌రావు పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కరువు బారిన పడిన రైతులకు తక్షణం ఆర్థిక సాయాన్ని అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటల బీమా కోసం బడ్జెట్‌లో రూ.1,600 కోట్లు ప్రకటించి బల్లలు చరిచారని, మూడేళ్లయ్యిందని.. పంటల బీమా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. పంటల బీమా అమలు చేసి ఉంటే ఇప్పుడు కరువుతో పంట నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం అందేదని అన్నారు. 

తెలంగాణలో రేవంత్‌ వృష్టి.. 
అతివృష్టి.. అనావృష్టి.. ఉంటాయి.. కానీ రాష్ట్రంలో వచ్చింది ముమ్మాటికీ రేవంత్‌ వృషే్టనని హరీశ్‌రావు అన్నారు. దేవాదులలో 60 టీఎంసీలు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కేవలం 18 టీఎంసీలకే పరిమితం చేసి చంద్రబాబుకు వదిలేయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నీటిని కూడా అలాగే దిగువకు వదిలేశారని విమర్శించారు. నదుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా మోటార్లు ఆన్‌ చేయకుండా పంటలు ఎండబెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్‌ అని విమర్శించారు.

మరమ్మతుల పేరుతో 20 టీఎంసీల సింగూరు నీటిని నదిలోకి వదిలేసి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల వాసులకు తాగునీరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మరమ్మతు పనులను కనీసం పది శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు నీళ్లు ఇవ్వని ప్రభుత్వం, బీరు కంపెనీలకు మాత్రం పుష్కళంగా నీటిని సరఫరా చేస్తోందని విమర్శించారు. 

సింగూరు నీళ్లను ఆ నాలుగు జిల్లాలకే ఇవ్వాలి.. 
నీటి మట్టం రెండు టీఎంసీలకు పడిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి, సింగూరు నీటిని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకే పరిమితం చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. తక్షణం బీరు ఫ్యాక్టరీలకు నీటి సరఫరా నిలిపివేసి, ప్రజల గొంతులు తడపాలని అన్నారు. కరువుతో కష్టాల పాలైన రైతులను ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీతారెడ్డి, స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement