'దీపావళి కానుక' పేరుతో సైబర్ వల.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త! | Cybercrime Alert, Beware Of Fake Diwali Gift Offers Used By Fraudsters To Cheat People | Sakshi
Sakshi News home page

'దీపావళి కానుక' పేరుతో సైబర్ వల.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త!

Nov 7 2026 11:27 AM | Updated on Nov 7 2026 12:15 PM

Cybercrime Alert, Beware Of Fake Diwali Gift Offers Used By Fraudsters To Cheat People

సాక్షి,హైదరాబాద్‌: పండుగల వేళ ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా ‘పేటీఎం దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ రూ.1,000 నగదు అందిస్తోంది.. వెంటనే క్లెయిమ్ చేసుకోండి’ అంటూ సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్‌లో ఓ సందేశం వైరల్ అవుతోంది. అయితే ఈ సందేశం పూర్తిగా నకిలీ అని, దీని వెనుక సైబర్ నేరగాళ్ల కుట్ర ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి.

‘మొదట ఇది ఫేక్ అని అనుకున్నా.. కానీ నిజంగానే నా ఖాతాలో రూ.1,000 వచ్చాయి. మీరు కూడా ప్రయత్నించండి’ అంటూ కొందరు పంపుతున్న సందేశాలు ప్రజలను మరింతగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి మాటలతో ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పండుగ సమయంలో ఉచితంగా డబ్బులు వస్తాయనే ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ ఉచ్చును పన్నుతున్నారు. ఈ సందేశాలను నమ్మి అందులో ఇచ్చిన లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా akcxy.buzz వంటి అనుమానాస్పద వెబ్‌సైట్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్ల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ సమాచారం, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ సమాచారం కేటుగాళ్ల చేతికి చిక్కితే బాధితుల బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకపోవడమే మంచిది.

ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గుర్తుతెలియని, అనుమానాస్పద వెబ్‌సైట్ లింకులపై క్లిక్ చేయకూడదు. నకిలీ ఆఫర్లను నిజమని నమ్మి వాట్సాప్ గ్రూపుల్లో, బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకింగ్ వివరాలు, యూపీఐ పిన్, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. ఏదైనా ఆఫర్ నిజమో కాదో తెలుసుకోవాలంటే సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌లో మాత్రమే పరిశీలించాలి.

ఒకవేళ ఇలాంటి సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకున్నా, వెంటనే స్పందించడం చాలా ముఖ్యం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. పండుగ కానుకల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన సందేశాలను గుడ్డిగా నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement