తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల యత్రా కాలం సమీపిస్తున్న తరుణంలో, అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళ ప్రభుత్వం, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. మండల-మకరవిళక్కు యాత్రా సీజన్‌ను పురస్కరించుకుని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రత్యేక శబరిమల ఉత్సవ నియంత్రణ గది (ఫెస్టివల్ కంట్రోల్ రూమ్) అధికారికంగా సేవలను ప్రారంభించింది.
తిరువనంతపురంలోని దేవస్థానం బోర్డు ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న నందన్‌కోడ్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం సమీపంలో ఈ అత్యాధునిక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. యాత్రికులకు ప్రయాణ మార్గదర్శకాలు, తక్షణ సహాయం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కేంద్రం రాత్రింబవళ్లు పని చేయనుంది. ఈ కంట్రోల్ రూమ్ ప్రత్యేకత ఏమిటంటే.. భక్తులు శబరిమలకు సంబంధించిన వివిధ రకాల సేవలను ఒకే వేదిక ద్వారా పొందవచ్చు.
భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం కంట్రోల్ రూమ్‌లోనే ప్రత్యేక కేఎస్ఆర్టీసీ బస్ బుకింగ్ కౌంటర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా పంపా యాత్రకు సంబంధించిన టిక్కెట్లు, బస్ రిజర్వేషన్లు సులభంగా చేసుకోవచ్చు.
శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్, దర్శన టిక్కెట్లతో పాటు స్వామివారి ప్రసాదాలైన అప్పం, అరవణ, మరియు నెయ్యాభిషేకం వంటి ముఖ్యమైన నైవేద్యాల బుకింగ్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఈ 24 గంటల ఫెస్టివల్ కంట్రోల్ రూమ్‌ను కేరళ దేవస్థానం, ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ ప్రారంభించారు.
అదేవిధంగా, రవాణా శాఖ మంత్రి సీపీ జాన్ జాన్ కేఎస్ఆర్టీసి సేవలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రభుత్వ,దేవస్థానం బోర్డు ఏర్పాట్లను సమీక్షించారు. రాబోయే మండల-మకరవిళక్కు సీజన్‌కు విచ్చేసే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి యాత్ర సులభంగా, సురక్షితంగా సాగేలా వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రులు ఈ సందర్భంగా వెల్లడించారు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, యాత్రకు సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా ఈ నియంత్రణ గదిని సంప్రదించవచ్చని బోర్డు వర్గాలు సూచించాయి.


