న్యూఢిల్లీ : దేశ రక్షణ రంగంలో కలకలం రేపిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థల ఆపరేటింగ్‌లు పన్నిన ‘హనీట్రాప్’ వలలో భారత వైమానిక దళానికి చెందిన ఒక అధికారి చిక్కుకున్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన సుందరాంగుల నగ్న చిత్రాలు, మాయమాటలకు ముగ్ధుడై.. దేశానికి అత్యంత గోప్యంగా ఉండాల్సిన యుద్ధ ప్రణాళికలను శత్రు దేశానికి చేరవేశాడు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌కు చెందిన గూఢచారులు సోషల్ మీడియా వేదికగా ఒక నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించారు. అందమైన మహిళల చిత్రాలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, భారతీయ రక్షణ రంగానికి చెందిన అధికారులను టార్గెట్ చేశారు.
ఈ క్రమంలోనే ఐఏఎఫ్ ఆఫీసర్‌తో ఆ నకిలీ అకౌంట్ ద్వారా చాటింగ్ ప్రారంభించారు. కొద్ది రోజులకు ఆ పాక్ ఆపరేటివ్ ఆ అధికారితో మరింత సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే అతనికి ఆకర్షణీయమైన, నగ్న చిత్రాలను పంపింది. ఆ అందాల వలలో, మాయమాటల్లో పూర్తిగా చిక్కుకుపోయిన ఆ ఎయిర్ ఫోర్స్ అధికారి విచక్షణ కోల్పోయాడు.
రహస్య పత్రాలు లీక్..
అతని బలహీనతను ఆసరాగా చేసుకున్న ఆ గూఢచారి నెట్‌వర్క్, క్రమంగా భారత సైన్యం, వైమానిక దళానికి సంబంధించిన వ్యూహాత్మక సమాచారాన్ని రాబట్టడం ప్రారంభించింది. శత్రువుల కోరిక మేరకు ఆ అధికారి ఎలాంటి భయమూ లేకుండా దేశ భద్రతను పణంగా పెట్టాడు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన యుద్ధ ప్రణాళికలు, సైనిక కదలికలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఆ పాక్ ఆపరేటివ్‌కు వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా షేర్ చేశాడు.
భారత నిఘా సంస్థలు , మిలిటరీ ఇంటెలిజెన్స్ సైబర్ కదలికలపై నిరంతరం నిఘా ఉంచడంతో ఈ గుట్టు రట్టయింది. ఆ ఎయిర్ ఫోర్స్ అధికారి కదలికలపై అనుమానం వచ్చి రహస్యంగా దర్యాప్తు చేయగా, ఆయన దేశ రహస్యాలను శత్రుదేశానికి చేరవేస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించాయి.
దీంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు,అధికారులు అదుపులోకి తీసుకున్నాయి. దేశద్రోహం, అధికారిక రహస్య చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశాం. శత్రువుల ఒక చిన్న వ్యూహానికి దేశ భద్రతను తాకట్టు పెట్టిన ఈ ఘటన రక్షణ రంగంలో తీవ్ర కలకలం రేపింది.


