నేడు న్యూజిలాండ్‌తోభారత్ నాలుగో వన్డే
టెస్టు సిరీస్ సన్నాహాల్లో ఇరు జట్ల కీలక ఆటగాళ్లు
ఉదయం గం.7:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లో ప్రసారం
మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్ పర్యటనలో టి20 సిరీస్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు... ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించగా... మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నేడు ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో గత మూడు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించగా... ఈ మ్యాచ్‌కు ఆ ఇబ్బంది లేదు.
అయితే ఈ నెల 19 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండటంతో... అటు న్యూజిలాండ్, ఇటు భారత్ తమ కీలక టెస్టు ఆటగాళ్లకు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చాయి. దీంతో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సుదీర్ఘ ఫార్మాట్ సన్నాహాల్లో నిమగ్నం కాగా... శ్రేయస్ అయ్యర్ తొలిసారి వన్డే జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు సొంతగడ్డపై వరుసగా 11 వన్డే సిరీస్ విజయాల తర్వాత తొలిసారి ఇబ్బందికర పరిస్థితుల్లో కనిపిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు. ఇక్కడ జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో రెండో బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది.
రోహిత్‌కు జోడీగా ఇషాన్..
రెగ్యులర్ కెప్టెన్ గిల్ గైర్హాజరీలో... రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోని రోహిత్ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తుండగా... ఇషాన్ వికెట్ కీపర్ బాధ్యతలు కూడా చూసుకోనున్నాడు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్ స్థానాన్ని రుతురాజ్ గైక్వాడ్ భర్తీ చేస్తాడు.
హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ వన్డే జట్టులోకి వచ్చినా... అతడు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. అక్షర్ పటేల్, నమన్ ధీర్ ఆల్‌రౌండర్ కోటా పూర్తి చేయనున్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేసర్ సిరాజ్‌కు ఈసారి అవకాశం దక్కొచ్చు. అర్‡్షదీప్, ఆఖిబ్ నబీ, గుర్నూర్‌తో కలిసి అతడు పేస్ దళాన్ని నడిపించనున్నాడు.
ఫిన్ అలెన్‌పై ఆశలు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, హెన్రీ నికోల్స్‌కు చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చింది. దీంతో ఆ జట్టులో అనుభవ రాహిత్యం కనిపిస్తున్నా... ‘అవకాశం దక్కించుకున్న ప్రతీ ఒక్కరు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని కివీస్ కీపర్ సీఫెర్ట్ అన్నాడు. ఫిన్ అలెన్, మిచ్ హే, డీన్ ఫోక్స్‌క్రాఫ్ట్, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్ ఈ మ్యాచ్ ఆడనున్నారు. న్యూజిలాండ్ జట్టు చివరగా... ఏడేళ్ల క్రితం సొంతగడ్డపై టీమిండియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది.


