భారత్‌కు మరో ఒలింపిక్ బెర్త్
దోహా: ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు మూడు పతకాలతోపాటు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా లభించింది. పురుషుల ట్రాప్ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో వివాన్ కపూర్ రజత పతకం గెలిచాడు. దాంతోపాటు భారత్‌కు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో నిర్ణీత 30 షాట్‌ల తర్వాత వివాన్ (భారత్), అబ్దుల్ రహ్మాన్ అల్‌ఫైన్ (కువైట్) 29 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్ణయించారు.
మూడో షాట్‌లో వివాన్ గురి తప్పగా... అల్‌ఫైన్ సఫలమయ్యాడు. దాంతో అల్‌ఫైన్‌కు స్వర్ణం, వివాన్‌కు రజతం లభించాయి. 22 పాయింట్లతో కియింగ్ (చైనా) కాంస్యం సాధించాడు. ఫైనల్లో పోటీపడ్డ భారత మరో షూటర్ ఉదయ్‌వీర్ సింగ్ 11 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. అంతకుముందు నాన్ ఒలింపిక్ కేటగిరీ అయిన పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో అంకుర్ గోయల్ (భారత్) 583 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
అంకుర్ గోయల్, అమన్‌ప్రీత్ సింగ్, రాజ్‌కన్వర్ సింగ్‌లతో కూడిన భారత బృందం 1727 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. నేటితో ముగియనున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత్ 2 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్యాలతో కలిపి 13 పతకాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో భారత్‌కు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు లభించాయి.


