సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పేరుతో పేద ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. బ్లాక్‌మెయిల్ చేయడానికే హైడ్రా వచ్చిందని, కోర్టులు స్టేలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫాక్స్ సాగర్‌లో మునిగిపోయే భూములు కాకపోయినా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎల్‌ఆర్‌ఎస్ ఉన్న ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.
అదేవిధంగా నాగార్జునకు చెందిన నిర్మాణాలను కూల్చిన దానికంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చారని ఈటల ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వివరాలన్నింటినీ త్వరలో బయటపెడతామని చెప్పారు. హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజల ఆస్తులను కూల్చివేసిన అధికారుల వ్యవహారంపై ఆలోచించాలని కోరారు. హైడ్రా విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు కూడా ఆలోచించాలని సూచించారు.
మరోవైపు, రేవంత్‌రెడ్డి తన వ్యవహారశైలితో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను బలవంతంగా లాక్కోవడం ఏంటని నిలదీశారు. చివరగా హైడ్రా తీరును నియంతృత్వంగా అభివర్ణిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అది గుడ్డి వ్యతిరేకత


