మమ్మల్ని ఆపగలమనుకోవడం వారి భ్రమ | CM Revanth Reddy Speech at Bharat Summit 2026: Telangana | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ఆపగలమనుకోవడం వారి భ్రమ

Nov 15 2026 5:30 AM | Updated on Nov 15 2026 5:30 AM

CM Revanth Reddy Speech at Bharat Summit 2026: Telangana

గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికపై సెల్ఫీ తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సల్మాన్‌ ఖుర్షీద్, ఉత్తమ్, వివిధ దేశాల ప్రతినిధులు

రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి నియంతృత్వాన్ని రుద్దాలని చూస్తున్నారు 

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో మార్పు తథ్యం 

గొప్ప లక్ష్యం కోసం అందరం కలిసి పోరాడదాం 

భారత్‌ సమ్మిట్‌–2026 ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచీకరణ, కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపు ఒకే రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ప్రాథమిక హక్కులపై దాడులు, విద్య, ఉపాధి, వైద్య సేవలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలు అన్ని దేశాల్లోనూ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చాలా దేశాల ప్రజల కలలు, ఆకాంక్షలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని, లక్షలాది మంది ప్రజలు తమ ఆకాంక్షలను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలను వినాలని, వారి కలలను సాకారం చేయాలని ఆశపడుతున్నారని చెప్పారు.

ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ఎంతో గొప్పదని, అందరూ కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్నారు. శనివారం భారత్‌ సమ్మిట్‌–2026 ముగింపు కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో పోరాటానికి రాహుల్‌ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని, ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం కోసం, దళితులు, మైనారిటీలు, ఓబీసీలకు సామాజిక న్యాయం కల్పించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఈ పోరాటానికి అందరం మద్దతివ్వాలని, ఆయన నాయకత్వంలో మార్పును తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

‘ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు శక్తుల మధ్య పోరాటం జరుగుతోంది. ఒక శక్తి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంటే, మరో శక్తి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తోంది. మేం రాజ్యాంగం, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాం. కానీ వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, నియంతృత్వాన్ని రుద్దా­లని చూస్తున్నారు.

ప్రతి పౌరుడికీ ఓటు హక్కు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమకు నచ్చిన కొన్ని వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని చూస్తున్నారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, మైనారిటీలు, రైతులతో సహా ప్రతి ఒక్కరినీ రక్షించాలని మేము కోరుకుంటున్నాం. కానీ వారు తమ సంపన్న మిత్రులను మాత్రమే కాపాడుకోవాలని చూస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం.

కానీ వారు కొద్దిమంది చేతుల్లోనే అధికారాన్ని కేంద్రీకరించాలని చూస్తున్నారు. మేము చర్చలు, సంప్రదింపులను కోరుకుంటున్నాం. కానీ వారు ఒకే వ్యక్తి నుంచి ఆదేశాలు రావాలని కోరుకుంటున్నారు. మమ్మల్ని ఆపగలమని వారు భావిస్తున్నారు. కానీ అది వారి భ్రమ మాత్రమే. మేము ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతున్నంత కాలం ప్రపంచంలోని ఏ శక్తీ మమ్మల్ని ఆపలేదు. 70 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తే, మనం కోరుకుంటున్న మార్పును తీసుకురాగలం. ఈ గొప్ప లక్ష్యం కోసం మనమందరం చేతులు కలిపి పోరాడదాం’అని రేవంత్‌ చెప్పారు.  

తెలంగాణకు రాయబారులుగా వ్యవహరించాలి: మంత్రి ఉత్తమ్‌ 
తెలంగాణలోని అభివృద్ధి, పెట్టుబడులు, ఆవిష్కరణలు, భా­గ­స్వామ్య అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని, సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులంతా తమ దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత తెలంగాణకు రాయబారులుగా వ్యవహరించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అంతర్జాతీయ ప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులు, దీర్ఘకాలిక అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ భవిష్యత్తుపై విస్తృత దృక్పథం కలిగిన నాయ­కత్వం అవసరమని, దేశంలోని అత్యధిక ప్రజలు రాహుల్‌ గాం«దీలో నాయకత్వ లక్షణాలను చూస్తున్నారని చెప్పారు. 

ప్రపంచంతో అనుసంధానిస్తున్నా: మంత్రి శ్రీధర్‌బాబు 
సామాజిక న్యాయాన్ని అభివృద్ధికి పునాదిగా చేసుకుంటూ తెలంగాణను ప్రపంచంతో అనుసంధానిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. రాహుల్‌గాంధీ ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగు అని చెప్పారు. ప్రగతి, సంక్షేమం, గౌరవప్రదమైన జీవనం సమాంతరంగా సాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు అంతర్జాతీయ ప్రతినిధులను ఆహా్వనించారు.

ప్రపంచంపై ఆధిపత్యం సాధించాలనే ధోరణి కాకుండా దేశాల మధ్య పరస్పర భాగస్వామ్యం, చర్చలు, సహకారమే నేటి అవసరమన్నారు. హెచ్‌ఐసీసీలో 12 అంతర్జాతీయ చర్చాగోషు్టలు నిర్వహించామన్నారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement