‘అది ముట్టుకోకు.. ఇది పట్టుకోకు.. అక్కడ గీయకు.. ఇక్కడ నిలబడకు..’ | Kids Gadgets Creative Toys Parenting | Sakshi
Sakshi News home page

‘అది ముట్టుకోకు.. ఇది పట్టుకోకు.. అక్కడ గీయకు.. ఇక్కడ నిలబడకు..’

Oct 18 2026 11:12 AM | Updated on Oct 18 2026 12:11 PM

Kids Gadgets Creative Toys Parenting

ఫండే

TECH టమారం

‘అది ముట్టుకోకు... ఇది పట్టుకోకు... అక్కడ గీయకు... ఇక్కడ నిలబడకు...’ ఇలా పిల్లల చుట్టూ రోజంతా ఎన్ని హెచ్చరికలు ఉన్నా, వాళ్ల చేతులు ఊరుకుంటాయా? అస్సలు కాదు! అందుకే వాళ్ల ఊహలకు అడ్డుకట్ట వేయకుండా, పెద్దల ఓపికకు పరీక్ష పెట్టకుండా... అల్లరి చేయించే గాడ్జెట్లే ఇవీ!

నీళ్లతో బొమ్మలు!
కోతికి కొబ్బరిచిప్ప ఇచ్చినా, పిల్లాడి చేతికి పెన్‌ ఇచ్చినా ఒకటే! వెంటనే, వారిలోని కళాత్మకమైన చంద్రముఖి బయటకు వచ్చి నేల నుంచి సోఫా వరకు అన్నింటిని ఒక ‘ఆర్ట్‌ గ్యాలరీ’లా తయారు చేస్తుంది. ఇప్పుడు ఆ ఆర్ట్స్‌ మరకల భయం లేకుండా చేస్తుంది ఈ మ్యాజిక్‌ మాట్‌. దీనిపై నీళ్లతో నింపిన పెన్నుతో ఎన్ని గీతలు... ఎన్ని బొమ్మలు.. ఎన్ని రంగులు వేసినా క్షణాల్లో మాయం చేస్తుంది. 

ఎటువంటి ఇంక్, రంగులు అవసరం కూడా లేదు. కేవలం నీటిని ఉపయోగించే బొమ్మలు గీయొచ్చు. పైగా గీసిన బొమ్మలు కొంతసేపటికి మాయమైపోతే, మళ్లీ కొత్తగా గీయొచ్చు! అలా పిల్ల్లలు తమ ఊహలకు నచ్చినట్టు బొమ్మలు గీసుకుంటూ ఒక కొత్త కలల ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. మ్యాట్‌ను మడిచి దాచుకోవచ్చు కాబట్టి, ప్రయాణాల్లోనూ వెంట తీసుకెళ్లొచ్చు. ఒక మ్యాట్, రెండు నీటి పెన్నులతో వస్తుంది. ధర రూ.500.  

చిట్టి చేతుల్లో మట్టి రాజ్యం!
మట్టిని చూసి... దానితో ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని పిల్లలు అనుకుంటే, అదే మట్టిని చూసి, పిల్లలకు చేతులు మురికవుతాయని టెన్షన్‌  పడే పెద్దవాళ్లకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుంది ఈ కిడ్స్‌ పాటరీ వీల్‌ కిట్‌. బ్యాటరీతో పనిచేసే ఈ చక్రంపై మట్టిని పెట్టి, ఆడుకుంటూనే చిట్టి చేతులు ఎన్నో చిన్న చిన్న కుండలు, పాత్రలు చేసుకోవచ్చు.

తర్వాత వాటికి రంగులు వేసి తమకు నచ్చినట్టు అలంకరించుకోవచ్చు. రెండు వేగాలతో పనిచేసే బ్యాటరీ ఆపరేటెడ్‌ వీల్‌ ఉండటంతో పిల్లలు తమకు నచ్చిన వేగంలో పని చేసుకోవచ్చు. పాటరీ వీల్‌తో పాటు మట్టి, రంగులు, రెండు బ్రష్‌లు, చెక్కే పనిముట్లు, కత్తిరించే దారం... ఇలా కావాల్సిన సామగ్రి కూడా ఇందులోనే ఉంటుంది. ఆడుకుంటూనే చేతి నైపుణ్యం, సమన్వయం, సృజనాత్మకత పెంచుకోవచ్చు. ధర రూ.710.

చల్లని చిట్టి కవచం!
చిన్నారులకు జ్వరం వచ్చిందంటే అమ్మ... థర్మామీటర్‌ కంటే ముందు తడిగుడ్డ కోసం వెతుకుతుంది. ఎందుకంటే, జ్వరం వేడిని కూల్‌ చేయటానికి. అయితే, అదే తడిగుడ్డను పెద్ద తలనొప్పిగా ఫీల్‌ అయ్యే చిన్నారుల కోసం వచ్చిందే ఈ కూలింగ్‌ ప్యాచ్‌ ఫర్‌ ఫీవర్‌. హైడ్రోజెల్‌తో తయారైన ఈ పట్టీ నుదుటికి అతుక్కుని చల్లదనాన్ని అందిస్తూ కాస్త హాయిగా అనిపించేలా చేస్తుంది.

మృదువుగా, వంచుకునేలా ఉండటంతో పిల్లలకు ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. ఒక్కో పట్టీని ఒక్కసారి మాత్రమే వాడాలి. ఇది సౌకర్యంలోనే కాదు, శుభ్రత విషయంలోనూ ప్రథమ స్థానంలో ఉండటంతో, వెంటనే దీనిని ఇంటి ప్రథమ చికిత్స పెట్టెలో ఉంచుకోవచ్చు. పది పట్టీల ప్యాక్‌ ధర రూ. 300 మాత్రమే!

ఇదీ చదవండి: ఈవారం కథ: కొండల నుంచి వచ్చిన వసంతం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement