రంగస్థలం
‘అమ్మా, కశ్మీర్‌కు వెళుతున్నాను’ అని నార్వే యువకుడు హాన్స్ క్రిస్టియన్ ఓస్ట్రో తల్లితో చెప్పినప్పుడు, కుమారుడితో పాటు ఆ తల్లి సంతోషంలో మునిగిపోయింది. ఎంతో ఉత్సాహంతో కశ్మీర్‌కు వచ్చిన ఆ యువకుడు ఊహించని రీతిలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యాడు. మూడు దశాబ్దాలు గడిచిపోయినా, ఈ సంఘటన ఇప్పటికీ సంచలనమే. హృదయ విదారకమే. ఈ సంచలన ఘటనపై వచ్చిన ‘హంస’ నాటకం మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రంగస్థలం మీదికి వచ్చింది...
అసద్ హుసేన్ రాసిన, రజిత్ కపూర్ దర్శకత్వం వహించిన ‘హంస’ నాటకం భావోద్వేగాలు, గాఢమైన మానవీయ కోణాలను రంగస్థలంపైకి తీసుకువచ్చింది. పృథ్వీ థియేటర్ ఫెస్టివల్ 2026లో భాగంగా సరన్ష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ నాటకంలో శ్వేతా త్రిపాఠి, షెర్నాజ్ పటేల్, సాదియా సిద్దిఖీ, ఫైసల్ రషీల్, సాహిల్ అహుజా, రజిత్ కపూర్ నటించారు.
కాలాతీత కథ
‘చాలా సంవత్సరాల క్రితమే హంస నాటకాన్ని చదివాను. కథ నా మనసులో బలంగా నిలిచిపోయింది. గత సంవత్సరం ఈ నాటకాన్ని మళ్లీ ఒకసారి చదివినప్పుడు అది నన్ను పూర్తిగా ఆవహించింది. ఆ కథలో తెలియని ఆకర్షణ ఏదో ఉంది. ఈ కథలోని సారాన్ని, దుఃఖాన్ని, సమస్త అనుభూతులను ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకువెళ్లే అద్భుతమైన నటులు నా దగ్గర ఉన్నారు’ అన్నారు రజిత్ కపూర్. ఇక శ్వేతా త్రిపాఠిని ఆకర్షించిన విషయం ఈ కథలోని మానవీయ కోణం. ‘భౌగోళిక పరిస్థితులు, రాజకీయాలకు అతీతంగా మనుషులు మనుషుల గురించి ఆలోచించే కథ ఇది’ అంటుంది త్రిపాఠి.
అనుభవమే పాఠం
‘హంస’ నాటక సృష్టికర్త అసద్ హుసేన్ విషయానికి వస్తే, తన నాటకరంగ ప్రస్థానాన్ని దిల్లీలోని ‘చింగారి’ ట్రూప్‌తో ప్రారంభించారు. ఎన్నో ఫ్రెంచ్ నాటకాలను హిందీలోకి అనువదించారు. ‘ది పార్టీ’ పేరుతో నాటకం రాశారు. రచయితగా ఆయనకు బాగా పేరు తీసుకువచ్చిన నాటకం మాత్రం... హంస.
వ్యక్తిగత కారణం
‘1995లో నార్వే పర్యాటకుడు హాన్స్ తల నరికి చంపారు ఉగ్రవాదులు. ఆ తరువాత కాలంలో డేనియల్ పెర్ల్‌వంటి మరికొందరు వ్యక్తులను కూడా ఇలాగే ఘోరంగా హత్య చేశారు. ప్రస్తుతం ఐసిస్(ఐఎస్‌ఐఎస్) వ్యక్తుల తల నరికి, ఆ క్రూరమైన వీడియోలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో గత చరిత్రను తిరిగి సమీక్షించుకోవడానికి ఇది సరైన సమయం అనిపించింది. ఈ నాటకం రాయడానికి నాకు వ్యక్తిగత కారణం కూడా ఉంది. మా మామగారైన డా. ఐజీఖాన్ అలీగఢ్‌కు చెందిన చరిత్రకారుడు, సామాజిక కార్యకర్త. హాన్స్‌లాగే ఖాన్ కూడా అర్థరహిత హింసకు బలయ్యారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, వారి గురించి మనం ఏం తెలుసుకోగలం? నాటకం రాసేటప్పుడు నేను దీని గురించే ఎక్కుగా ఆలోచించాను. అయితే అది నాకు పూర్తిగా అర్థమైందో లేదో తెలియదు’ అన్నారు అసద్ హుసేన్.
ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా...
నార్వే దేశపు నాటకరంగ నిపుణుడైన హాన్స్ కథకళి నేర్చుకోవడానికి, మహాభారతం ఆధారంగా నాటకం రాయడానికి కశ్మీర్‌కు వచ్చాడు. ఎన్నో కలలతో వచ్చిన ఆయనను కశ్మీర్ మిలిటెంట్లు క్రూరంగా హత్య చేశారు. ఈ ఘోరంపై హంస(సాంగ్ ఆఫ్ ద స్వాన్) అనే నాటకం రాశారు అసద్ హుసేన్. హాన్స్ తల్లి దృష్టికోణంలో సాగే నాటకం ఇది. తన కుమారుడి దారుణ మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఆమె ఇండియాకు వచ్చారు. కేరళలోని ఒక ఫొటోగ్రాఫర్‌ని కలిశారు.
కథాకళిపై అతనికి ఉన్న ఆసక్తి గురించి, గ్రామంలో పిల్లలను ఎలా అలరించేవాడో...మొదలైన విషయాలను ఆ ఫొటోగ్రాఫర్ నోటి నుంచి విన్నారు. అక్కడ అందరూ హాన్స్‌ను ‘హంస’ అని పిలిచేవారు. ఆ తరువాత కశ్మీర్‌కు వెళ్లారు. ఎక్కడ విన్నా, ఎప్పుడు విన్నా హాన్స్ గురించి మంచి మాటే! అలాంటి మంచి వాడిని ఉగ్రవాదులు ఎందుకు పొట్టన పెట్టుకున్నారు? అతడిని రక్షించడానికి ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించలేదని కూడా ఈ నాటకం చెబుతుంది.
బెంగళూరులోని రంగశంకర రంగస్థల బృందం కూడా ‘హంస’ నాటకాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ప్రదర్శించింది. ఎన్ని నాటక సంస్థలు ఈ నాటకాన్ని ఆడినా, ఎన్ని రంగస్థల వేదికలపై ప్రదర్శితమైనా ఈ నాటకం ఎప్పటికప్పుడూ వైవిధ్యాన్ని సంతరించుకుంటోంది.
ఆ తల్లి కోసమే...ఈ నాటకం
హాన్స్ తల్లిని దృష్టిలో పెట్టుకొని రాసిన నాటకం ఇది. కుమారుడి మరణం తరువాత అతడి జ్ఞాపకాల దారిలో తల్లి మన దేశానికి వచ్చింది. స్వదేశానికి తిరిగి వెళ్లిన తరువాత కుమారుడిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. అది అంతులేని దుఃఖం. హాన్స్ కథాకళి నేర్చుకునే దృశ్యాలను చిత్రించిన వీడియోగ్రాఫర్, హాన్స్‌ని కిడ్నాప్ చేసిన ఒక దుకాణదారుడు, హాన్స్‌ను బందీగా ఉంచిన గ్రామంలోని ఒక యువతి, అతడిని విడిపించడానికి ఉగ్రవాదులతో చర్చలు చేసిన మధ్యవర్తి ఈ నాటకంలో కనిపిస్తారు. వీరే కాకుండా కశ్మీర్‌కు చెందిన సంప్రదాయ ‘భండ్ పత్తర్’ అనే కళారూపంలోని ‘మస్ఖరా’ అనే విదూషకుడు ఈ నాటకంలో కనిపిస్తారు. విదూషకుడి పాత్ర జీవితం–మరణం మధ్య ఉండే అనేక అంశాల గురించి మాట్లాడుతుంది. మస్ఖరా మాటలు వింటున్నప్పుడు హాన్స్ తల్లి ఊహల్లో నుంచి పుట్టిన పాత్ర ఇది అనిపిస్తుంది.
– అసద్ హుసేన్


