1907 ఆగస్టు 14.. వేల్స్‌లోని కార్డిఫ్ జైలు బయట దాదాపు వెయ్యి మంది గుమిగూడారు. లోపల ఓ మహిళ తన 40వ పుట్టినరోజు జరుపుకోవాల్సిన రోజే ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. ఆమె పేరు లెస్లీ జేమ్స్. ఒక రోజు వయసున్న పసికందును ఉద్దేశపూర్వకంగా ఊపిరాడకుండా చేసి చంపిందన్న ఆరోపణలతో ఆమెకు మరణశిక్ష పడింది. అప్పట్లో ఈ కేసు వేల్స్‌లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే 119 ఏళ్ల తర్వాత ఈ కేసు మరోసారి చర్చలోకి వచ్చింది. రచయిత్రి మేరీ జోన్స్ రాసిన ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ లెస్లీ జేమ్స్ పుస్తకం.. అప్పటి విచారణ, సాక్ష్యాలు, లెస్లీ గత జీవితం గురించి ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది.
1907 జూలైలో స్వాన్సీ అసైజెస్ కోర్టులో లెస్లీ జేమ్స్‌పై విచారణ జరిగింది. కెర్ఫిల్లీ ప్రాంతంలోని ఫ్లూర్-డి-లిస్‌కు చెందిన మాడ్ ట్రెజర్ అనే మహిళకు పుట్టిన పసికందును హత్య చేసిందన్నది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. పాపను డబ్బు తీసుకుని చూసుకునేందుకు లెస్లీ తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. రైలులోనే పాపను హత్య చేసిందని ఆరోపించారు. అప్పటి పోలీసులు, కొన్ని వార్తాపత్రికలు ఈ ఘటనను ‘బేబీ ఫార్మింగ్’గా అభివర్ణించాయి. అయితే జోన్స్ ప్రకారం.. లెస్లీపై జరిగిన విచారణ కేవలం 12 నిమిషాల్లోనే ముగిసింది. విచారణ రోజునే న్యాయమూర్తి ఆదేశాలతో ఆమెకు కొత్త న్యాయవాదిని నియమించడంతో.. కేసును పూర్తిగా సిద్ధం చేసుకోవడానికి, అవసరమైన సాక్షులను కోర్టుకు తీసుకురావడానికి ఆయనకు తగిన సమయం కూడా లేకపోయిందని ఆమె పేర్కొన్నారు.
ప్లాన్ ప్రకారమే..?
ఈ కేసులో శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా కీలకంగా మారింది. పాపకు అప్పటికే నోట్లో నురుగు వస్తోందని, అందుకే కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా చుట్టి ఉంచారని పోలీసులకు చెప్పినట్లు జోన్స్ తెలిపారు. తల్లి పాలివ్వలేకపోవడం లేదా పాలివ్వడానికి ఇష్టపడకపోవడంతో శిశువుకు జీర్ణం కాని చక్కెర నీటి మిశ్రమాన్ని ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా పాపను చాలా గట్టిగా వస్త్రాలతో చుట్టారని, అందువల్ల లెస్లీ తీసుకెళ్తున్న పార్సిల్ పసికందు అని కూడా ఇతరులు గుర్తించలేకపోయారని చెప్పారు. ఆహారం గొంతులో ఇరుక్కోవడం లేదా గట్టిగా చుట్టడం వల్ల శ్వాస ఆడకపోవడం వంటి కారణాలతోనే శిశువు మరణించి ఉండవచ్చని జోన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లెస్లీకి గతంలోనూ ఇద్దరు శిశువులను చూసుకున్న అనుభవం ఉందని పుస్తకం చెబుతోంది. వారిలో ఒక శిశువును సాల్వేషన్ ఆర్మీ వద్ద వదిలిపెట్టి వైద్య సహాయం కోరిందని, మరో శిశువు దత్తత తీసుకున్న తర్వాత ఆరోగ్యంగా పెరిగిందని జోన్స్ పేర్కొన్నారు. ఈ విషయాలు కూడా విచారణలో లెస్లీకి అనుకూలంగా పూర్తిగా ప్రస్తావనకు రాలేదని ఆమె అంటున్నారు.
మెదడుకు గాయం..
లెస్లీ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇప్పుడు కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నేరానికి కొన్ని నెలల ముందు ఆమె బైక్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిందని జోన్స్ తెలిపారు. ముఖ్యంగా ఆమెకు మెదడుకు గాయం కావడంతో సుమారు మూడు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిందని పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆమె చెబుతున్నారు. లెస్లీ నేరానికి ఎంతవరకు బాధ్యత వహించాల్సి ఉన్నప్పటికీ.. ఆమెకు జరిగిన మెదడు గాయం, దాని ప్రభావాన్ని న్యాయస్థానం తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉండేదని జోన్స్ అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం లెస్లీ అసలు గుర్తింపే. అరెస్టయినప్పుడు ఆమె తన పేరు లెస్లీ జేమ్స్ అని చెప్పింది. అయితే అంతకుముందు ప్రజా రికార్డుల్లో ఆమెను రోడా విల్లిస్, రోడా డాల్జెల్, రోడా లాసెల్స్ వంటి పేర్లతో నమోదు చేసినట్లు జోన్స్ తెలిపారు. ఆమె 1863లో సుందర్‌ల్యాండ్‌లో జన్మించి ఉండవచ్చని, లండన్‌లోని ఒక బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నట్లు స్వయంగా చెప్పినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం ఆమె బాగా చదువుకున్న, స్పష్టంగా మాట్లాడగలిగే మహిళ. ఆమె నగల వ్యాపారి ఎర్నెస్ట్ డాల్జెల్ కుమార్తె అయి ఉండవచ్చని, అందువల్ల ఆమెకు ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండే అవకాశం ఉందని జోన్స్ అభిప్రాయపడ్డారు.
క్షమాభిక్ష తిరస్కరణ..
లెస్లీ ప్రాణాలను కాపాడేందుకు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. కార్డిఫ్ కౌన్సిల్, ఆమె న్యాయవాది హ్యారీ లాయిడ్, సాధారణ ప్రజలు కలిసి క్షమాభిక్ష కోసం పిటిషన్ చేపట్టారు. దాదాపు 50 వేల మంది దానిపై సంతకాలు చేశారు. ఉరిశిక్ష అమలు రోజున కార్డిఫ్ జైలు బయట సుమారు వెయ్యి మంది గుమిగూడారు. ఆమెను క్షమించాలని వారు కోరారు. కానీ వారి విజ్ఞప్తులు ఫలించలేదు. అంతకుముందు రాత్రే అప్పటి హోం సెక్రటరీ హెర్బర్ట్ గ్లాడ్‌స్టోన్ క్షమాభిక్షను తిరస్కరించారు. దక్షిణ వేల్స్‌లో విస్తరిస్తున్న ‘బేబీ ఫార్మింగ్’ను అరికట్టేందుకు లెస్లీ కేసును ఒక ఉదాహరణగా నిలపాలనే ఉద్దేశంతోనే ఆమెకు మరణశిక్ష అమలు చేయాలని నిర్ణయించినట్లు జోన్స్ పేర్కొన్నారు.
లెస్లీ కేసులో అప్పటి మీడియా వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. ఆమె నేరం కంటే అందం, ప్రశాంతత, వ్యక్తిత్వంపైనే పత్రికలు ఎక్కువగా దృష్టి పెట్టాయని జోన్స్ అన్నారు. ఉరిశిక్ష అమలు చేసిన అధికారి హెన్రీ పియర్‌పాయింట్ కూడా ఆమె అందం గురించి వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. ఉరిశిక్ష సమయంలో ఆమె ప్రశాంతంగా ఉన్న తీరు, ఆమె జుట్టుపై పడిన సూర్యకాంతి వంటి విషయాలు కూడా అప్పటి వార్తల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఒక మహిళపై సమాజం, మీడియా చూపిన దృష్టికోణం కూడా ఆమె కేసును ప్రభావితం చేసి ఉండొచ్చని జోన్స్ అభిప్రాయపడ్డారు.
1907 ఆగస్టు 14న లెస్లీ జేమ్స్ ఉరిశిక్షకు గురైంది. వేల్స్‌లో ఉరిశిక్షకు గురైన చివరి మహిళగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. కానీ ఆమె నిజంగా హంతకురాలా? లేక అప్పటి పరిస్థితులు, తొందరపాటు విచారణ, సామాజిక ఒత్తిళ్లకు బలైన మహిళా? 119 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం.. లెస్లీ జేమ్స్ కేసును చరిత్రలోని అత్యంత అనుమానాస్పద ఉరిశిక్ష కేసుల్లో ఒకటిగా నిలబెడుతోంది.


