న్యూఢిల్లీ: భారతదేశం ‘వికసిత భారత్’గా మారాలంటే దేశం మాదకద్రవ్య రహితంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్‌లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచడం, దేశాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ దిశగా చేపట్టిన మత్తు పదార్థాల విముక్తి ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత చురుగ్గా పాల్గొంటున్నారని ప్రశంసించారు. మాదకద్రవ్యాల బారిన పడితే కుటుంబాలు, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వినూత్న నినాదాలు, పాటలు, లఘు నాటకాల ద్వారా వివిధ భాషల్లో విస్తృత అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు.
ఆగస్టు నెలలో జాతీయ చేనేత దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం వంటి సందర్భాలు దేశభక్తి భావనను మరింత పెంచాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమని, ‘సూర్యపథ్ తిరంగా’ ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించిందని గుర్తుచేశారు. ‘పీఎం స్వనిధి’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకోగలిగారని చెప్పారు.
అమర్‌నాథ్ యాత్రలో వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమించారని, యాత్రలో గుర్రాలు, కంచరగాడిదల పేడను బయోగ్యాస్‌గా మార్చి ‘స్వచ్ఛ జ్యోతి’ను వెలిగించారని ప్రస్తావించారు. రాబోయే పండుగల సీజన్‌లో ‘ఓకల్ ఫర్ లోకల్’కు ప్రాధాన్యమిస్తూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు: 734కు చేరిన మృతుల సంఖ్య


