ఖాట్మండ్: హిమాలయాలను ముంచెత్తిన జలప్రళయం నేపాల్‌ను తీవ్ర అల్లకల్లోలానికి గురిచేసింది. ఈ విలయం మధ్య త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్‌లో సాగిన మృత్యుపోరాటం ప్రతీ ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. ఊపిరాడని ఆ మృత్యుకూపంలో, తిండి నీరు లేక 9 రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడిన ఇద్దరు కార్మికులు అద్భుత రీతిలో సురక్షితంగా బయటపడ్డారు. ఆ చీకటి నరకంలో నిరంతరం జపించిన ఆ పవిత్ర మంత్రమే తనను బతికించిందంటూ బాధితుడు కన్నీటిపర్యంతమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆగస్టు 26 నేపాల్-టిబెట్ సరిహద్దులోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన తీవ్రమైన కొండచరియలు, మంచుచరియలు విరిగిపడటంతో ఉత్తర, మధ్య నేపాల్ తీవ్రమైన ఆకస్మిక వరదల్లో చిక్కుకుంది. లంగ్టాంగ్ జాతీయ పార్క్ వద్ద ప్రారంభమైన ఈ ప్రవాహం త్రిశూలి నది నుంచి దాదాపు 100 కిలోమీటర్ల మేర ఉధృతంగా ప్రవహించి దారంతా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

రసువా, నువాకోట్, దాడింగ్, గోర్ఖా, తనాహున్, చిత్వాన్ జిల్లాలు ఈ వరద ధాటికి సర్వనాశనమయ్యాయి. గైరోంగ్-కేరుంగ్ సరిహద్దు పోర్ట్, రోడ్లు, వంతెనలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్ట్ టన్నెల్స్ కొట్టుకుపోవడంతో వందలాది గ్రామాలు బురద, శిథిలాల కింద పూడుకుపోయాయి. అయితే, టన్నెల్‌లో విధి నిర్వహణలో ఉండి చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ చేపట్టిన గాలింపు చర్యల్లో ఒక ఊహించని అద్భుతం జరిగింది! మృత్యుకూపంగా మారిన త్రిశూలి 3ఏ ప్రాజెక్ట్ టన్నెల్ శిథిలాల నడుమ నుంచి ఇద్దరు కార్మికులు ఏకంగా 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్తుపోయేలా చేసింది.
రెస్క్యూ టీమ్స్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బురద తొలగించి, టన్నెల్ సందు గుండా 30 ఏళ్ల మెకానికల్ ఫోర్‌మన్ సంజయ్ షా, 45 ఏళ్ల మెకానికల్ సూపర్‌వైజర్ కబీర్ మహర్జన్ లను బయటకు తీశాయి. 9 రోజుల చీకటి నరకం నుంచి ప్రాణాలతో భయటపడడంపై సంజయ్ షా స్పందించారు. రెస్క్యూ సిబ్బంది ‘నన్ను కాపాడినప్పుడు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇది నాకు పునర్జన్మ అని భావోద్వేగానికి గురయ్యాడు. కబీర్ మహర్జన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను నేపాల్ ఆర్మీ హెలికాప్టర్‌లో ఖాట్మండ్ సైనిక ఆసుపత్రికి తరలించగా, సంజయ్ షా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సందర్భంగా సంజయ్ షా తనకు ఎదురైన భయానక క్షణాలను వివరిస్తూ..‘నేను కంట్రోల్ రూమ్‌లో ఉన్నప్పుడు వరద నీరు ఒక్కసారిగా టన్నెల్‌లోకి దూసుకొచ్చింది. నా బాధ్యత ఇతరుల ప్రాణాలు కాపాడటం. అందుకే అందరినీ వెంటనే బయటకు పరిగెత్తమని కేకలు వేశాను. అందరూ సురక్షితంగా బయటకు వెళ్లేలా చూసే క్రమంలో నేను వెనకబడిపోయాను. అప్పటికే టన్నెల్ ద్వారాలన్నీ నీరు, బురదతో పూర్తిగా మూసుకుపోయాయి.
చీకటి, తాగునీరు, ఆహారం లేని ఆ 9 రోజులూ నన్ను బతికించింది కేవలం దైవచింతనే. నిరంతరం ‘హరే కృష్ణ’ మహామంత్రాన్ని జపిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకున్నాను’ అని అన్నారు. విశేషమేమిటంటే వారు సురక్షితంగా బయటపడిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి కావడం విశేషం.
తనకు సమీపంలో మరో 3-4 మంది కార్మికుల శబ్దాలు వినబడ్డాయని, అయితే టన్నెల్ చాలా పొడవుగా ఉండటంతో పవర్‌హౌస్ వైపు మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని సంజయ్ చెప్పాడు. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, సశస్త్ర సీమా బల్, భారత టన్నెల్ నిపుణుల బృందాలు సంయుక్తంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో టన్నెల్‌లోకి ప్రవేశించి మిగిలిన వారి కోసం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశాయి.


