breaking news
Hare Krishna movement
-
పేద విద్యార్థులకు పెన్నిధి
మహబూబ్‌నగర్ రూరల్: విద్యార్థులు, పేదలు, ఆస్పత్రుల్లో రోగుల సహా యకులకు హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఉచితంగా భోజనం అందించడం అభినందనీయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ మండలం కోడూర్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 వేల భోజనాలు అందించే సామర్థ్యం కలిగిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను, మహబూబ్‌నగర్ నియోజ కవర్గంలోని 20 వేలమంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పా హారం అందించే ‘స్వస్త్య ఆహార’ పథకాన్ని మంత్రి శనివారం ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద విద్యార్థులకు పెన్నిధి లాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఫౌండర్ సత్యగౌర చంద్రదాస్ ప్రభూజి, జెడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
గోకుల క్షేత్రానికి భూ కేటాయింపు.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
పటమట (విజయవాడ తూర్పు): సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సేవలు హర్షణీయమని హరేకృష్ణ మూవ్మెంట్ ఇండియా రాష్ట్ర ఏడీఎం సత్యగౌరచంద్రదాస్ చెప్పారు. విజయవాడలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తమ సంస్థ తాడేపల్లి మండలం కొలనుకొండలో నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమి కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గోకుల క్షేత్రం నిర్మాణం ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇస్కాన్ బెంగళూరు ప్రెసిడెంట్ మధుపండిట్‌దాస్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. (చదవండి: బంగారు ‘సీమ’.. కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్) -
హరేకృష్ణ ఉద్యమం అక్షయం... అమృతం
అక్షయపాత్ర... మహాభారత కాలం నాటిది. ధర్మరాజు దగ్గర ఉండేదంటారు. ఇప్పుడు కనుక ఉంటే ప్రభుత్వాలకు... ‘ఆహార భద్రత బిల్లు’ పెట్టే అవసరం ఉండకపోయేది. అమృతం... భాగవతకాలం నాటిది. సాగరమథనంలో బయటపడిందంటారు. ఇప్పుడు కనుక ఉంటే శాస్త్రవేత్తలకు... మృత్యువును జయించే ప్రయోగాలు తప్పివుండేవి. ఒకవేళ ఉన్నా... అక్షయం, అమృతం.... నిరుపేద బడిపిల్లలకు... అసుపత్రులలోని రోగుల సహాయకులకు... అందుబాటులోకి వచ్చేవంటారా? చెప్పలేం, డౌటే! కానీ ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇస్కాన్ వారి ‘హరేకృష్ణ ఉద్యమమే’ లేకుంటే... లక్షలాదిమందికి పిల్లలకు, పెద్దలకు రోజూ ఇంత... అక్షయ భోజనం, అమృత భోజనం దొరికేవి కావు. ఇంతకన్నా ‘జనహితం’ ఏముంటుంది?! ఏ ఆధ్యాత్మిక సంస్థయినా ఏం చేస్తుంది? గుడి కడుతుంది.. సకల జీవరాశికి శుభాలు జరగాలని పూజలు చేసి ప్రసాదాలు పెడుతుంది.. మహా అయితే, అడపాదడపా అన్నదానం చేస్తుంది. కానీ, ‘హరేకృష్ణ ఉద్యమం’ అంతటితో ఆగడం లేదు. ఆధ్యాత్మికతకు సేవాతత్పరతను జోడిస్తోంది. పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టే పక్కా కార్యాచరణకు దిగుతోంది. చదువుల తల్లి కటాక్షానికి బడుగుల బిడ్డలు పాత్రులవ్వాలంటే.. ముందు ఆకలిని బడి దరిదాపుల్లోంచి తరిమికొట్టాల్సిందేనని త్రికరణ శుద్ధిగా నమ్ముతోంది. అందుకే, ‘అక్షయపాత్ర’ను చేపట్టి.. ప్రభుత్వబడుల్లో మధ్యాహ్న వేళ వేడివేడిగా పుష్టికరమైన ఆహారం వడ్డిస్తూ... ఇటు ప్రభుత్వ సాయానికి అటు ప్రైవేటు వితరణను జోడించి చక్కని ఫలితాలు సాధిస్తోంది. 13 ఏళ్ల ప్రస్థానం... ‘అక్షయపాత్ర’ దేశంలోని వేలాది గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న లక్షలాది మంది పేద విద్యార్థుల కడుపునింపుతోంది. ఊరు కాని ఊరిలో ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న తమ ఆత్మీయులతోపాటు ఉంటూ నానాయాతన పడుతున్న నిస్సహాయులకు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చక్కని మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది ‘హరేకృష్ణ ఉద్యమం’. ‘అపరిమిత ఆహారంతో అపార విద్య’ ఇదే ఈ ఉద్యమ నినాదం. ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్) బెంగళూరు అనుబంధ సంస్థగా 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో హరేకృష్ణ ఉద్యమం మొదలైంది. ‘అక్షయ పాత్ర’ ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో ఉంది. 1500 మందితో ప్రారంభమై ప్రతిరోజూ 14 లక్షల మందికి భోజనం అందించే దశకు విస్తరించింది. 2020 నాటికి రోజూ 50 లక్షల మందికి భోజనం వడ్డించాలని అక్షయ పాత్ర ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. డా.వైఎస్ఆర్ ఆహ్వానంతో.. అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు అక్షయపాత్ర మన రాష్ట్రంలో సర్కారీ బడి పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. 2008 అక్టోబర్ 13న ప్రారంభమైన ‘అక్షయ పాత్ర’ కార్యక్రమం క్రమంగా కొత్తబడులకు విస్తరిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా హరేకృష్ణ ఉద్యమ సేవకులు సుశిక్షిత సైన్యంగా కదులుతున్నారు. ఈ అద్భుత కృషి వెనుక 15 మంది పూర్తికాల సేవకుల కఠోర శ్రమ, 180 మంది సిబ్బంది దీక్ష దాగి ఉన్నాయి. వందలాది సర్కారీ బడులు, అనేక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో రోజూ 88 వేల మందికి పుష్టికరమైన ఆహారం అందుతోంది. పటాన్‌చెరులోని అద్దె షెడ్లలో ఏర్పాటైన అత్యాధునిక సెంట్రల్ కిచెన్ నుంచే.. వందకిలోమీటర్ల దూరాన ఉన్న బడిలో బాలలకు కూడా.. అప్పుడే వండినట్టుండే పొగలు కక్కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. తృప్తికరం.. మెదక్ జిల్లాలో 11 మండలాల్లోని 439 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ‘అక్షయ పాత్ర’ కార్యక్రమం ద్వారా రోజూ మధ్యాహ్న భోజనం అందుతోంది. 61,348 మంది విద్యార్థినీ విద్యార్థులు ఈ భోజనం ఇష్టంగా తింటూ చదువులపై ధ్యాసపెడుతున్నారు. మధ్యతరగతి పిల్లలు ప్రైవేటు కాన్వెంట్లలో ఉదయం ఎప్పుడో వండిన అన్నం క్యారియర్లలో తెచ్చుకొని తింటూ సరిపెట్టుకుంటున్న పరిస్థితుల్లో పేదపిల్లలు ప్రభుత్వ బడుల్లో వేడి వేడిగా భోజనం చేయడం ‘అక్షయపాత్ర’ పుణ్యమే. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ‘అక్షయ పాత్ర’ 123 కోట్లమందికి భోజనం వడ్డించింది. ప్రతిరోజు 13లక్షలమంది విద్యార్థుల పళ్లాల్లో అన్నం పెడుతున్న అక్షయపాత్రకు దాతలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నారు. 1,29,045 మంది దాతల సాయంతో నడుస్తోన్న ఈ పాత్ర తన పరిధిని మరింత విస్తరింపజేసుకోవడానికి కొత్త పథకాలను పరిచయం చేస్తోంది. అదే ‘భోజనామృతం’. పటాన్చెరు కిచెన్‌లో... తెల్లవారు జామున 4 గంటల నుంచే పటాన్చెరు కిచెన్‌లో వంటల హడావుడి ప్రారంభమవుతుంది. అన్నం, సాంబారు/పప్పుతోపాటు వారానికోరోజు అనేక స్పెషల్వంటకాలను విద్యార్థులకు అందిస్తున్నారు. వారానికోసారి వెజ్ బిర్యానీ, పులిహోర, వేరుశనగ ఉండలు, మురుకులు, బిస్కెట్లు, అరటి/బత్తాయి వంటి పండ్లు, శనగలు ఇస్తున్నారు. 20 నిమిషాల్లో క్వింటాల్ బియ్యాన్ని ఉడికించే సామర్థ్యం ఉన్న 10 రైస్ బాయిలర్లున్నాయి. శుచిలోనూ, శుభ్రతలోనూ ఎక్కడా రాజీ లేకుండా వేలమందికి ప్రణాళికాబద్ధంగా నాణ్యతా ప్రమాణాలతో కూడిన వంటలు సిద్ధమవుతున్న తీరు, 80 కిలోమీటర్ల దూరంలోని బడుల్లోనూ వేడివేడిగా అన్నామృతాన్ని వడ్డిస్తున్న తీరు అబ్బుర పరుస్తుంది. జీపీఎస్ వ్యవస్థ ద్వారా వాహనాల కదలికలను గమనిస్తూ సమయపాలన పాటిస్తుండడం విశేషం. గతనాలుగేళ్లలో మన హైదరాబాద్‌లో 3,38,06,088 మంది విద్యార్థులకు అన్నం వడ్డించింది. రోజుకి 61వేల విద్యార్థులకు భోజనం సరఫరా చేస్తోంది. ఎందరో దాతలు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘అక్షయపాత్ర’ కార్యక్రమం నడుస్తోంది. అయితే, పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ కంపెనీల విరాళాలతో నడిచే ‘భోజనామృతం’ కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల్లో రోగుల సహాయకులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. ఎంఈఐఎల్ తదితర సంస్థలు, ఎందరో వ్యక్తులు ఆర్థికంగా దోహదపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆహారాన్ని తరలించే ప్రత్యేక వాహనాలను హెచ్‌పీసీఎల్, అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు, సంస్థలు విరాళంగా అందించడం విశేషం. హైదరాబాద్‌లోని నార్సింగ్‌లో సొంత భవనాల్లో ఆధునిక కిచెన్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - పంతంగి రాంబాబు, ‘సాక్షి’ స్పెషల్ డెస్క్ ఫొటోలు: రమేష్ ఆసుపత్రిలో ‘భోజనామృతం’! దూరప్రాంతాల నుంచి వచ్చి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న తమ బంధువులకు తోడుగా ఉంటున్న పేదల కు హరేకృష్ణ ఉద్యమం అండగా నిలుస్తోంది. ‘భోజనామృతం’ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం రోజూ 1100 మందికి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, నీలోఫర్ పిల్లల ఆసుపత్రి, మహావీర్ ఆసుపత్రులలోని రోగుల సహాయకులకు ప్రత్యేక బార్కోడ్ కూపన్ల ద్వారా ఆసుపత్రి ఆవరణలో భోజనామృతం వడ్డిస్తున్నారు. వీటితోపాటు నిజామాబాద్, మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అక్షయపాత్ర భోజనం సరఫరా చేస్తోంది. ‘మాది టెంపుల్ బేస్డ్ స్పిరిచ్యువల్ కమ్యూనిజం’! ఆకలితో అలమటిస్తున్న బాలలు చదువుపై మనసు పెట్టలేరు. విద్యపై ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా ఖర్చుపెడుతున్నప్పటికీ, అమల్లో సమస్యల వల్ల పూర్తి ప్రయోజనం నెరవేరడం లేదు. అందుకే, ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థులకు ఐఎస్ఓ 22,000 ప్రమాణాలతో మధ్యాహ్న భోజనాన్ని అందించడంలో స్వచ్ఛందంగా మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. మెదక్ జిల్లాలోని 61,348 మంది విద్యార్థులకు, శేరిలింగంపల్లి మండలంలోని అంగన్వాడీల్లో 25,693 మందికి రోజూ పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. అంతేకాదు... వీరి సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాతలు స్పందిస్తే ఏడాదిలోనే ఈ కిచెన్ సిద్ధమవుతుంది. సహాయపడదలచినవారు పూర్తి వివరాలకోసం www.akshayapatra.org ను చూడవచ్చు. - సత్యగౌర చంద్రదాస, అధ్యక్షులు, హరేకృష్ణ ఉద్యమం/ అక్షయపాత్ర యూనిట్, హైదరాబాద్