మా హక్కులు పరిరక్షించండి | BRS MLAs submit 13 page petition to Governor | Sakshi
Sakshi News home page

మా హక్కులు పరిరక్షించండి

Sep 10 2026 2:26 AM | Updated on Sep 10 2026 2:26 AM

BRS MLAs submit 13 page petition to Governor

మాపై కేసులు, అరెస్టులు సస్పెన్షన్ల విషయంలో జోక్యం చేసుకోండి 

గవర్నర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల13 పేజీల వినతిపత్రం  

అన్ని ఆధారాలూ ఇచ్చాం: కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యులపై పోలీసులు, మార్షల్స్‌ దాడి చేశారు. కేసీఆర్‌ ఇంటిపై దాడికి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్‌ ఇవ్వడంతో పాటు రోప్‌ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్‌ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు లోక్‌భవన్‌ బయట మీడియాతో మాట్లాడారు.  

ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. 
తమ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిసినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 

అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు.

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. 
అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్‌కు వివరించినట్లు కేటీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్‌ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్‌ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. 

తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్‌ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement