గవర్నర్‌ను కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్, హరీశ్ సమావేశం
మూడు రోజుల కార్యాచరణను ప్రకటించనున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు అనుసరించాల్సిన రాజకీయ, పోరాట వ్యూహంపై శాసనసభా పక్షం సభ్యులతో వారు చర్చించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పేలా అసెంబ్లీ వేదికగా కొనసాగించిన పోరాటాన్ని ఇక సభ వెలుపల కూడా విస్తరించాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
గురువారం ఉదయం కేటీఆర్ నివాసంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అల్పాహార భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రానున్న మూడు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను చర్చించాలని బీఆర్‌ఎస్ యోచిస్తోంది.
అసెంబ్లీలో చర్చకు నోచుకోని 22ఏ అంశంతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను మాక్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని భావిస్తోంది. ఆయా అంశాలను కేవలం తెలంగాణ భవన్‌కే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచి్చన హామీలు, వాటి అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీ వెళ్లనుంది.
సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులతో కూడిన బృందం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌తోపాటు మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనుంది. అసెంబ్లీ పరిసరాల్లో తమకు జరిగిన అవమానం, పోలీసుల వ్యవహారశైలి, తమపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను ఆయా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు. గవర్నర్‌ను కలిసిన సందర్భంగా కూడా ఈ అంశాలను ఆధారాలతో వివరించిన నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలోనూ వాటిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


